బిడ్డా గంగుల మాడి మసైపోతారు: ఈటల.. వెంట్రుక కూడా పీకలేవు: గంగుల
- IndiaGlitz, [Tuesday,May 18 2021]
మాజీ మంత్రి ఈటల రాజేందర్ హవాను తగ్గించేందుకు కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులకు పార్టీని వీడకుండా కట్టడి చేసేందుకు మంత్రి గంగుల కమలాకర్‌రెడ్డి ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా మందిని కట్టడి చేయగలిగారు. అయితే ఈ క్రమంలోనే ఈటలపై గంగుల మాటల తూటాలు పేలుస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకూ సంయమనం పాటించిన ఈటల నేడు బరస్ట్ అయ్యారు. దీంతో గంగుల సైతం ఈటలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల వర్సెస్ గంగుల వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. బిడ్డా.. గంగుల గుర్తుపెట్టుకో అంటూ ఈటల స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తే.. నా వెంట్రుక కూడా పీకలేవంటూ గంగుల ఎదురు దాడికి దిగారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఈటల మీడియాతో మాట్లాడారు.
Also Read: ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు కేసీఆర్ నిర్ణయం
అధికారం ఎవడికీ శాశ్వతం కాదు..!
‘అధికారం ఎవడికీ శాశ్వతం కాదు.. బిడ్డా గంగుల గుర్తు పెట్టుకో’ అంటూ ఈటల ఫైర్ అయ్యారు. కరీంనగర్ సంపదను నాశనం విధ్వంసం చేశావని... కరీంనగర్‌ను బొందల గడ్డగా మర్చావంటూ మండిపడ్డారు. ‘‘నీ పదవీ పైరవీల కారణంగా వచ్చింది. నీ కల్చర్ నాకు తెలుసు. నీ బెదిరింపులకు భయపడను. నా ప్రజలు నిన్ను పాతర పెడతారు. ఇప్పుడు మాట్లాడుతున్న నాయకులంతా ఒక్క రోజైనా ఇక్కడి ప్రజల బాధను పంచుకున్నవారా?. ఇక్కడ ఎవరి గెలుపులో అయినా సరే మీరు సాయం చేశారా? నాపై తోడెళ్ళలా దాడులు చేస్తున్నారు. మంత్రిగా సంస్కారం, సభ్యత ఉండాలి. బిడ్డా గుర్తు పెట్టుకో.. ఎవడూ వెయ్యేళ్ళు బతకరు. నువ్వు (గంగుల) ఎన్ని టాక్స్‌లు ఎగ్గొట్టినవో తెలవదు అనుకుంటున్నావా?. టైమ్ వచ్చినప్పుడు అన్నీ బయట పడతాయి. నీ కథ ఎందో అంతా తెలుసు. 2023 తరువాత నువ్వు ఉండవు.. నీ అధికారం ఉండదు. నువ్వు ఇప్పుడు ఏం పని చేస్తున్నావో అదే నీకు పునరావృతం అవుతుంది. అదే గతి నీకు పడుతుంది. ప్రజలు అమాయకులు కారు. సంస్కారంతో మర్యాద పాటిస్తున్నా. సహనం కోల్పోతే మాడి మసైపోతారు ’’ అని గంగులపై ఘాటు వ్యాఖ్యలు గుప్పిస్తూ ఈటల వార్నింగ్ ఇచ్చారు.
ఈటలపై మంత్రి గంగుల కమలాకర్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. వెంట్రుక కూడా పీకలేవు అంటూ వ్యాఖ్యానించారు. జిల్లాలో మంగళవారం మాట్లాడిన ఆయన.. ఈటలకు ఆత్మగౌరవం ఉంటే, వెంటనే ఆ భూములను ప్రభుత్వానికి అప్పగించాలన్నారు. ఆయన బెదిరిస్తే భయపడేవాడు ఎవడూ లేడన్నారు. బిడ్డా గిడ్డా అంటే అంతేస్థాయిలో సమాధానం ఇవ్వగలమన్నారు. 1992 నుంచి గ్రానైట్ బిజినెస్ చేస్తున్నానని... నీలాగ అసైన్డ్ భూములను ఆక్రమించుకోలేదు. 2004లో దివంగత నేత ఎమ్మెస్సార్ దేవాదాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు క్రమబద్దీకరణకు ప్రయత్నిస్తే... ఆయన కుదరదని తేల్చి చెప్పారు. 2018లో నా ఓటమిని కోరుకున్న వ్యక్తి ఈటల. గెలిచినప్పటి నుంచి అసహనంతో ఉన్నాడు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు నాతో మాట్లాడలేదు. టీఆర్ఎస్ పతనాన్ని కోరుకున్న వ్యక్తి ఈటల. సజీవ సాక్ష్యాలివి. దాస్తే దాగేవి కావు. తెలంగాణ ప్రజలు అమ్ముడుపోతారని అంటావా... మాకు పదవులు ముఖ్యం కాదు. కేసీఆర్ అధికారంలో ఉంటే చాలనుకుంటున్నాం. టీఆర్ఎస్‌కు ఓటేస్తే అమ్ముడు పోయినట్టా... నువ్వు సంస్కారం తప్పుతున్నావు. మేము ఆచితూచి మాట్లాడుతున్నాము. ఏం చేస్తావు.. వాట్సాప్, యూట్యూబ్‌లలో తిట్టిస్తావు అంతే కదా. ఇదిగో వెంట్రుక కూడా పీకలేవు. నేను ఫుల్ బీసీని... ఎక్కడైనా బీసీనే. నువ్వు హాఫ్ హాఫ్ బీసీవీ.. హుజూరాబాద్ బీసీవీ... హైదరాబాద్ ఓసీవీ’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.