బ్రేకింగ్ : టిఆర్ఎస్ కు ఈటెల రాజేందర్ రాజీనామా.. సంచలన కామెంట్స్!
- IndiaGlitz, [Friday,June 04 2021]
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ఈటెల రాజేందర్ వ్యవహారం నేటితో కొత్త మలుపు చోటు చేసుకుంది. 19 ఏళ్లుగా ఉన్న టిఆర్ఎస్ పార్టీతో ఆయన అనుబంధాన్ని తెంచుకున్నారు. టిఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ఇదీ చదవండి: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పండగ చేసుకునే వార్త!
ఈ సందర్భంగా రాజేందర్ శామీర్ పేటలో తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించి ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ కోసం, తెలంగాణ సాధన కోసం తన కృషిని తాను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ కోసం ఎన్నో సార్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశా. తిరిగి గెలిచిన చాలా తక్కువ మందిలో నేనూ ఒకడిని అని అన్నారు.
బానిసకంటే అద్వానంగా ఉన్న మంత్రి పదవి తనకు అవసరం లేదని ఈటెల అన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కేసీఆర్ ధర్మాన్ని నమ్ముకుని నడిచేవారు. ఇప్పుడు డబ్బు, కుతంత్రాలు ప్రాధాన్యంగా మారాయి అని తీవ్ర విమర్శలు చేశారు.
గత ఐదేళ్ల నుంచే తనకు పార్టీతో గ్యాప్ మొదలైందని ఈటెల అన్నారు. హరీష్ రావు కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు అని ఈటెల చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. నయీమ్ లాంటి వారు బెదిరించినా తాను వెనకడుగు వేయలేదని అన్నారు. దేనికి భయపడనని, తనకు హుజురాబాద్ ప్రజల మద్దతు ఉందని ఈటెల అన్నారు.
ఇప్పటికే తాను హుజురాబాద్ ప్రజల అభిప్రాయంతో పాటు, తెలంగాణ ఉద్యమ సహచరుల అభిప్రాయం కూడా తీసుకున్నానని ఈటెల అన్నారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఈటెల అన్నారు.