ఈటల, కొండా కలిసి కేసీఆర్ సీటుకు ఎసరు పెడతారా?
Send us your feedback to audioarticles@vaarta.com
ఇటీవల మాజీ మంత్రి ఈటల రాజేందర్‌తో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి భేటీ అయ్యారు. ఆ భేటీలో ఏం జరిగిందో ఏమో కానీ కొండా మాత్రం స్పీడ్ పెంచేశారు. తన మాటల్లో చేతల్లో చాలా జోష్ కనబరుస్తున్నారు. ఇద్దరు మంత్రులు టచ్‌లో ఉన్నారని హడావుడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈటల, కొండా కలిసి ఉద్యమాకారులు, అసంతృప్తులతో కలిసి త్వరలోనే పార్టీ పెట్టవచ్చనే ఊహాగానాలు జోరందుకుంటున్నాయి. ఇటు ఈటల మాత్రం ఇంకా ఎటూ తేల్చుకోలేకపోతున్నట్టు కనిపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి మాత్రం ఫుల్ సపోర్టు ఇస్తున్నారు. ఇదే అదునుగా బీజేపీ వాళ్లు కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు.
Also Read: కరోనా సంరక్షణా కేంద్రానికి అమితాబ్ భారీ విరాళం
ఈటలను చూస్తే మాత్రం అయోమయంగానే కనిపిస్తున్నారు. కొత్త పార్టీనా.. కాంగ్రెస్‌లోకా.. బీజేపీలోకా.. అనేది అర్థం కావడం లేదు. ఇటు కేసీఆర్ సర్కార్ మాత్రం రోజుకో ఊహించని షాకులిస్తోంది. ఈటల సొంత జిల్లాపై నజర్ పెట్టింది. ఆయన్ను ఎవరెవరు కలుస్తున్నారు.. ఆయన అనుచరులెవరు.. అండగా ఉన్న అధికారులెవరనేది తెలుసుకుని మరీ ఒక్కొక్కరినీ టార్గెట్ చేస్తోంది. ఇప్పటికే ఈటలకు అనుకూలురుగా భావించే కొందరు అధికారులను బదిలీ చేసేసింది. అలాగే ఆయన అనుచరులుగా ఉన్న పుట్ట మధుపై కేసులు తిరగదోడే పనిలో పడింది. అలాగే ఈటల మరో అనుచరుడు, వీణవంక జడ్పీటీసీ భర్త సాదవ రెడ్డికి కెడీసీసీ బ్యాంక్ నోటీసులు పంపింది. ఈటలకు ఎటూ ఊపిరి సలపకుండా ప్రభుత్వం చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మరోవైపు గులాబీ కోటలో కలకలం మొదలైంది. అధిష్టానం వైఖరిపై కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న నేతలంతా ఈటలను కలుస్తున్నారు. అలాగే తగిన గుర్తింపు దక్కని పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు సైతం ఈటలను కలిసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈటలను కలిసే నేతల సంఖ్య మాత్రం రోజురోజుకూ పెరిగిపోతోంది. తాజాగా మహిళా టీఆర్ఎస్ నేత ఈటలతో భేటీ అవగా.. అధిష్టానం వైఖరిపై కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి ఈటల రాజేందర్‌ను కలవడం చర్చనీయాంశంగా మారింది. మరికొందరు నేతలు సైతం ఈటలను కలిసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈటల కొత్త పార్టీ పెడతారనే ప్రచారం మరింత జోరందుకుంది. మొత్తానికి ఈటల, కొండా కలిసి తెలంగాణ సీఎం కేసీఆర్ సీటుకు ఎసరు పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments