Etela Rajender:హరీష్‌రావు అందుకే బతికిపోయాడు: ఈటల రాజేందర్
Send us your feedback to audioarticles@vaarta.com
సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావులపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు. గజ్వేల్ నియోజకవర్గంలోని కుకునూర్ పల్లి మండలం లకుడారంలో నిర్వహించిన ప్రచార ర్యాలీలో పాల్గొన్న ఈటల మాట్లాడుతూ కేసీఆర్‌ను కాదని సొంతంగా నిర్ణయం తీసుకునే దమ్ము ఉందా హరీష్‌కు ఉందా అని సవాల్ విసిరారు. తాను ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా సొంతంగా నిర్ణయం తీసుకునే అవకాశం లేదన్నారు. బీఆర్ఎస్ మంత్రివర్గంలో ఉన్న వారంతా కేసీఆర్ బానిసలని వ్యాఖ్యానించారు. కేసీఆర్ అనుమతి లేకుండా చీమైనా చిటుక్కుమనదని పేర్కొన్నారు.
కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేసేందుకే తనను కేసీఆర్ పార్టీ నుంచి బయటకు పంపించారని ఆరోపించారు. హరీష్ అల్లుడు కాబట్టి ఏం చేయలేదని.. ఈసారి అధికారంలోకి వస్తే హరీష్‌ను కూడా పార్టీ నుంచి గెంటేస్తారని చెప్పుకొచ్చారు. అహంకారంతో రెచ్చిపోతున్న కేసీఆర్ ఈసారి గజ్వేల్‌లో ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. తనను రాజకీయంగా అంతం చేయాలనుకున్న కేసీఆర్.. చివరకు తానే పతనం కాబోతున్నారని హెచ్చరించారు.
కాగా శుక్రవారం హుజూరాబాద్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్.. ఈటల రాజేందర్‌పై తొలిసారి విమర్శలు గుప్పించారు. హుజూరాబాద్ ప్రజలు గత ఉప ఎన్నికల్లో తనను బాధ పెట్టారని.. ఈసారి మాత్రం అలా జరగొద్దని కోరారు. పాలిచ్చే బర్రెను వదిలి పెట్టి ఎవరైనా దున్నపోతును తెచ్చుకుంటారా అంటూ ప్రశ్నించారు. హుజూరాబాద్లో బీజేపీ గెలిస్తే ఏమి వస్తుందని ప్రశ్నించారు. ఇక్కడ పోటీ చేస్తున్న కౌశిక్ రెడ్డి తన కొడుకు లాంటి వాడని ఆయనను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments