సీఎం మార్పుపై ఈటల క్లారిటీ..!
- IndiaGlitz, [Tuesday,January 19 2021]
ఇటీవల రాష్ట్రంలో హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే అది సీఎం మార్పు. సీఎం కేసీఆర్ తన స్థానంలో తన తనయుడిని కూర్చోబెట్టబోతున్నారన్న ప్రచారం ఇటీవలి కాలంలో మరింత జోరందుకుంది. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం అవుతారంటూ జరుగుతున్న ప్రచారంపై మంత్రి ఈటల రాజేందర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి మార్పు ఉంటే ఉండవచ్చునని, ఇందుకు రకరకాల కారణాలు ఉండొచ్చని ఆయన తెలిపారు. ఆదివారం రాత్రి ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం మార్పు ప్రచారంపై ఈటల స్పందిస్తూ ‘‘ఉంటే ఉండవచ్చు.. తప్పకుండా.. ఉంటే ఉంటదండీ.. తప్పేముంది?’’ అని ఈటల వ్యాఖ్యానించారు.
ఇక సీఎం కేసీఆర్‌కు.. మంత్రి ఈటలకు మధ్య గ్యాప్ వచ్చిందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై కూడా సదరు ఇంటర్వ్యూలో ఈటల స్పందించారు. తనకు, సీఎం కేసీఆర్‌కు మధ్య గ్యాప్‌నకు ఆస్కారమే లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో జరుగుతున్నదంతా కేవలం ప్రచారమేనని కొట్టిపారేశారు. తాను రాజకీయంగా సైలెంటయ్యాననే వార్తలను సైతం ఈటల తోసిపుచ్చారు. మనిషి పాత్ర ఎప్పుడూ ఒకే రకంగా ఉండదని... ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గొంతెత్తి మాట్లాడడం, ప్రజల వైపు నిలబడడం.. అదొక పాత్ర అని పేర్కొన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు మాటలు తక్కువగా ఉండి, చేతలు ఎక్కువగా ఉండాలన్నారు. ఇదొక పాత్ర. పాత్ర మారినప్పుడు మళ్లీ పాత విధానమే ఉంటుందని ఈటల స్పష్టం చేశారు. .
ఇక కేసీఆర్ తన డ్రీమ్ ప్రాజెక్టు అయిన యాదాద్రిలో మరో యాగాన్ని చేపట్టబోతున్నారు. ఫిబ్రవరి నెలలో సుదర్శన యాగం, చండీయాగంతో పాటు రాజశ్యామల యాగం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ నెలాఖరు నాటికి యాదాద్రి పనులన్నీ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు అందాయని సమాచారం. కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో నిర్వహించే చివరి కార్యక్రమం ఇదేనని తెలుస్తోంది. ఈ యాగం పూర్తయిన వెంటనే కేటీఆర్‌కు సీఎంగా పదవీ బాధ్యతలు అప్పగిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. అంతే కాకుండా ఆయన అనుకూల మీడియా ఛానెల్ సైతం ఈ విషయాలను ప్రసారం చేయడంతో ఈ వార్తకు మరింత బలం చేకూరినట్టైంది. ఇప్పుడు ఈటల వ్యాఖ్యలతో త్వరలోనే సీఎం మార్పు ఉండబోతోందని స్పష్టమవుతోంది.