ఈటల రాజేందర్ కు తృటిలో తప్పిన ప్రమాదం.. వేగంగా స్పందించిన పైలెట్
- IndiaGlitz, [Tuesday,June 15 2021]
మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు పెను ప్రమాదం తప్పింది. ఆయన తన బృందంతో ఢిల్లీ నుంచి బయలుదేరుతున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. పైలెట్ గుర్తించడంతో ప్రమాదం తప్పింది. భారతీయ జనతా పార్టీలో చేరేందుకు ఈటల తన సన్నిహితులు, టీంతో కలసి సోమవారం ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: సౌత్ నుంచి తొలి హీరో విజయ్ దేవరకొండ.. వైరల్ అవుతున్న సూపర్ స్టైలిష్ లుక్
అక్కడ ఢిల్లీ పెద్దల సమక్షంలో ఈటల బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. తిరిగి నేడు హైదరాబాద్ కు విమానంలో బయలుదేరారు. అయితే విమానం టేకాఫ్ అయ్యే సమయంలో సాంకేతిక లోపం తలెత్తింది. పైలెట్ లోపాన్ని గుర్తించి వేగంగా స్పందించారు. దీనితో ఈటల బృందానికి పెను ప్రమాదం తప్పినట్లయింది.
ఈటల బృందంతో పాటు 184 మంది ప్రయాణికులు ఆ విమానంలో ఉన్నారు. పైలెట్ అప్రమత్తతతో వందలాది ప్రాణాలు నిలిచాయి. ఈటల మరో ప్రత్యేక విమానంలో బయలుదేరినట్లు తెలుస్తోంది.
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో ఈటల బీజేపీలో చేరారు. టిఆర్ఎస్ పార్టీతో, కేసీఆర్ తో విభేదాలు తలెత్తడం.. భూ వివాదం నేపథ్యంలో ఈటల తనమంత్రి పదవి కోల్పోవడం జరిగింది. దీనితో ఈటల టిఆర్ఎస్ పార్టీ నుంచి తప్పుకున్నారు. తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. టిఆర్ఎస్ వర్సస్ ఈటల వ్యవహారంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి.