పనామా పేపర్స్ లీక్ కేసు: ఐశ్వర్యరాయ్‌కి ఈడీ నోటీసులు.. ఉలిక్కిపడ్డ బాలీవుడ్

  • IndiaGlitz, [Monday,December 20 2021]

నిన్న మొన్నటి వరకు డ్రగ్స్ వ్యవహారంతో బాలీవుడ్ బిగ్‌షాట్‌లను కేంద్రం వణికించిన సంగతి తెలిసిందే. ఇవి సద్దుమణుగుతుందిలే అనుకుంటున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం మళ్లీ మరోసారి హిందీ పరిశ్రమను కదిపింది. అదే పనామా పేపర్స్. ప్రపంచసుందరి, అందాల ఐశ్వర్యరాయ్‌కు పనామా పేపర్స్ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోమవారం సమన్లు జారీ చేయడంతో బాలీవుడ్ సహా యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది.

ఇవాళ ఢిల్లీలోని లోక్‌నాయక్‌ భవన్‌లో తమ ఎదుట హాజరు కావాలని ఐశ్వర్యారాయ్‌ని ఈడీ ఆదేశించింది. ఇప్పటికే పనామా లీక్‌ కేసులో ఐశ్వర్యపై ఈడీ మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసింది. ఈ కేసులో హీరోయిన్లు జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌, నోరా ఫతేహిలను ఈడీ విచారిస్తోంది. తాజాగా ఐశ్వర్యరాయ్‌కు ఈడీ నోటీసులు పంపడం.. తీవ్ర చర్చకు దారి తీసింది.

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లోని పన్ను ఎగవేతదారుల గుట్టురట్టు చేస్తూ వెలుగులోకి వచ్చిన పనామా పేపర్స్ కలకలం రేపుతున్నాయి. ఈ లిస్ట్‌లో సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార రంగాల ప్రముఖులు వున్నారు. వీరంతా పన్నులు కట్టకుండా అక్రమంగా విదేశీ బ్యాంకుల్లో దాచిన ఖాతాల వివరాలను పనామా పేపర్స్ బయటపెట్టింది. పనామాకు చెందిన మొసాక్‌ ఫోన్సెకా అనే కార్పొరేట్‌ సంస్థ వీటిని వెలుగులోకి తీసుకురావడంతో అవి ‘‘పనామా పేపర్స్’’గా ప్రాచుర్యంలోకి వచ్చాయి. 2016లో బయటపడ్డ పనామా పేపర్స్‌ లీకేజీతో పలువురు ప్రముఖులపై ఇప్పటికే కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఇందులో భారత్ నుంచి సుమారు 500 మందికి ప్రమేయం ఉన్నట్లు సమాచారం.

ఇక పెళ్లి, ప్రెగ్నెన్సీ తదితర కుటుంబపరమైన కారణాలతో కొన్నేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న ఐశ్వర్యరాయ్‌ తమిళ చిత్రం ‘పొన్నియన్‌ సెల్వన్‌’తో వెండితెరపై పునరాగమనం చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ చారిత్రక నవల ఆధారంగా క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు బాలీవుడ్ టాక్. దీనితో పాటు ఓ ఇండో అమెరికన్‌ చిత్రానికి కూడా ఆమె సైన్ చేసినట్లు తెలుస్తోంది. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ రచించిన ‘త్రీ ఉమెన్‌’ అనే పుస్తకం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంతో ఇషితా గంగూలీ దర్శకురాలిగా పరిచయమవుతోంది.