ఏలూరు ఘటన: రిపోర్టులన్నీ నార్మలే.. కానీ ఏం జరుగుతోంది?
Send us your feedback to audioarticles@vaarta.com
ఏలూరులో అంతుచిక్కని వ్యాధి సోకి దాదాపు 300 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. ఒకరు మృతి చెందారు. మిగిలిన వారందరికి చికిత్స కొనసాగుతోంది. అసలు ఈ వ్యాధి ప్రబలడానికి గల కారణాలను తెలుసుకునేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమై వ్యాధి సోకిన వారికి మెరుగైన వైద్యం అందిస్తోంది. కాగా.. పెద్ద సంఖ్యలో ప్రజానీకం అస్వస్థతకు గురి కావడానికి గల కారణాలపై జిల్లా కలెక్టర్ ఓ నివేదికను తయారు చేశారు.
జిల్లా కలెక్టర్ నివేదికలోని ముఖ్యాంశాలు:
మొత్తం అస్వస్థకు గురైనవారు – 340
ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారు – 157
మరణించిన వారు – 1
మెరుగైన చికిత్సకోసం తరలించిన వారు – 14
డిశ్చార్జి అయిన వారరు – 168
ఏలూరు నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఐదుగురికి చికిత్స, వారు కూడా డిశ్చార్జి
అస్వస్థతకు గురైన వారిలో పురుషులు 180, మహిళలు 160
అస్వస్థతకు గురైనవారిలో ఏలూరు అర్బన్‌కు చెందినవారు – 307
ఏలూరు రూరల్‌కు చెందిన వారు – 30
దెందులూరు – 3
వ్యాధి లక్షణాలు..
3 –5 నిమిషాలపాటు మూర్ఛ వస్తుంది. అయితే అది ఒక్కసారి మాత్రమే వస్తుంది కానీ రిపీట్ కాలేదు. మతిమరుపు, ఆందోళన, వాంతులు, తలనొప్పి, వెన్నునొప్పి, నీరసం వంటి లక్షణాలున్నట్టు జిల్లా కలెక్టర్ తన నివేదికలో వెల్లడించారు. కాగా.. ఇప్పటివరకూ.. ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాపించలేదని.. వ్యాధి తీవ్రత తక్కువగా ఉందన్నారు. ఏలూరులో మున్సిపల్ వాటర్ పంపిణీ లేని ప్రాంతాల్లో కూడా అస్వస్థతకు గురయ్యారని కలెక్టర్ తన నివేదికలో పేర్కొన్నారు. ఒక ఇంటిలో ఒకరు లేదా ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. ప్రత్యేకించి పలానా వయసు వారే అస్వస్థతకు గురవుతున్నారని లేదు. రోజూ మినరల్‌వాటర్ తాగే వాళ్లుకూడా అస్వస్థతకు గురయ్యారు. 22 తాగునీటి శాంపిళ్లు పరీక్షించగా రిపోర్టులు నార్మల్ అనే వచ్చాయి. 52 రక్త నమూనాలను పరీక్షించగా అవి సాధారణంగానే ఉన్నాయి. 35 సెరిబ్రల్ స్పైనల్ ఫ్లూయిడ్ శాంపిళ్లను పరీక్షంగా సెల్ కౌంట్ నార్మల్ వచ్చింది. కల్చర్ రిపోర్టు రావాల్సి ఉంది. 45 మంది సీటీ స్కాన్ చేశారు. ఫలితం నార్మల్‌గానే ఉంది. 9 పాల నమూనాలను స్వీకరించారు. అవి కూడా ఫలితాలు సాధారణంగానే ఉన్నాయి. 10 నమూనాలను హైదరాబాద్ సీసీఎంబీకి 10 పంపించారు. ఫలితం రావాల్సి ఉంది.
కాగా.. శనివారం ఉదయంలో ఏలూరు నగరంలోని దక్షిణపు వీధిలో ప్రజానీకం ఒక్కొక్కరుగా ఉన్నట్టుండి పడిపోయి నురగలు కక్కుతూ మూర్చ వచ్చి కొట్టుకులాడి స్పృహ కోల్పోయారు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు.. వందల్లో పిట్టలా పడిపోయారు. ఆరేళ్ల చిన్నారి నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకూ ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఈ అంతుపట్టని వ్యవహారం రాత్రికి నగరం మొత్తం వ్యాపించింది. మొదట సాధారణ ఫిట్స్గానే భావించి వైద్యులు చికిత్సను అందించారు. అయితే సాయంత్రానికి వీరి సంఖ్య వంద దాటడంతో వెంటనే అప్రమత్తమయ్యారు. వ్యాధి ఏమిటనే దానిపై చర్చించి.. వెంటనే పడిపోయిన ప్రతి ఒక్కరికీ సీటీ స్కాన్ చేశారు. ఎలాంటి లక్షణాలూ కనిపించలేదు. దీంతో వ్యాధి నిర్ధారణ కోసం ఏలూరు ప్రభుత్వాసుపత్రి వైద్యులు ప్రత్యేక బృందాలను సిద్ధం చేశారు. దక్షిణపు వీధి ప్రాంతానికి ప్రత్యేక వైద్య బృందాలను పంపి ఇంటింటి సర్వే చేపట్టారు. తిన్న ఆహారం, తాగిన నీరు, పరిసరాలను పరిశీలించారు. శనివారం సాయంత్రానికి నగరంలోని అన్ని ప్రాంతాల వాసులూ ఆసుపత్రికి చేరడంతో నగరమంతా వ్యాపించినట్టు వైద్యులు నిర్ధారణకు వచ్చారు అయితే అది గాలి కాలుష్యమా, నీటి కాలుష్యమా, దోమల వలన వచ్చిందా అనేది మాత్రం అంతుచిక్కలేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments