మస్క్ ట్వీట్ ఎఫెక్ట్ ఏ రేంజ్‌లో ఉందంటే..
- IndiaGlitz, [Saturday,January 09 2021]
ప్రపంచ కుబేరుడు, టెస్లా కంపెనీ సీఈవో ఎలన్ మస్క్ ఒక్క ట్వీట్‌తో రేపిన దుమారం అంతా ఇంతా కాదు. కంపెనీ ప్రైవసీ పాలసీలో కొత్తగా మార్పులు తీసుకొస్తున్నట్లు వాట్సాప్ ప్రకటించిన విషయం తెలిసిందే. యూజర్ల డేటాను ఫేస్‌బుక్‌తో పంచుకోవడం తప్పనిసరి చేయడం వివాదాస్పదమైంది. ఫిబ్రవరి లోగా.. ఈ నిబంధనలకు అంగీకరించకపోతే యూజర్ల ఖాతాలను తొలగిస్తామని వాట్సాప్ ప్రకటించింది. అంటే ఇప్పటి వరకూ అత్యంత గోప్యంగా ఉన్న మన సమాచారం సమస్తం ఫేస్‌బుక్ చేతుల్లోకి వెళ్లిపోతుంది.
వాట్సాప్ చేసిన ప్రకటనపై తీవ్ర అసంతృప్తి చెందిన ఎలన్ మస్క్.. ‘సిగ్నల్ వాడుకోండి’ అంటూ ఓ ట్వీట్ చేసి నెట్టంట్లో పెను దుమారాన్నే రేపారు. ఇక ఎలన్ మస్క్ ఇలా చెప్పాడో లేదో.. నెటిజన్లు సిగ్నల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసేసుకోవడం మొదలు పెట్టేశారు. ఎంతలా డౌన్ లోడ్ చేసుకున్నారంటే.. ఈ యాప్ నుంచి వెరిఫికేషన్ ఓటీపీలు రావడం కూడా కష్టమైపోయిందట. యాప్ సర్వర్లకు ఆ రేంజ్‌లో ట్రాఫిక్ వచ్చిందన్నమాట. ఈ సమస్యను గుర్తించిన సిగ్నల్ కంపెనీ.. దాన్ని వెంటనే సరిదిద్ది ఓటీపీలను పంపించింది.
అయితే ఇలా ఒక్కసారిగా యూజర్లను కోల్పోవడంతో తమ కొత్త పాలసీలపై వాట్సాప్ కంపెనీకి వివరణ ఇచ్చుకోక తప్పలేదు. వాట్సాప్ యూజర్లందరి డేటాను ఫేస్‌బుక్‌తో పంచుకోబోమని.. కేవలం బిజినెస్ అకౌంట్ల వివరాలను మాత్రమే ఫేస్‌బుక్ బిజినెస్ ఖాతాలతో పంచుకుంటామని చెప్పింది. కొత్త పాలసీకి ఓకే చెప్పినా కూడా సాధారణ యూజర్ల డేటాను వ్యాపార అవసరాల కోసం వాడుకోవడం జరగదని తేల్చి చెప్పింది. వాట్సాప్ క్లారిటీ ఇచ్చిన అనంతరం పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.