Elon Musk:ట్విట్టర్‌‌తో డబ్బు సంపాదించుకోండి.. యూజర్స్‌కు ఎలాన్ మస్క్ గుడ్‌న్యూస్

  • IndiaGlitz, [Friday,April 14 2023]

సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న నాటి నుంచి తలా తోక లేని నిర్ణయాలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నారు ఎలాన్ మస్క్. ఉద్యోగుల తొలగింపు, డేటా విక్రయం, ట్విట్టర్ పిట్ట స్థానంలో కుక్కను లోగోగా పెట్టడం ఇలా రకరకాల నిర్ణయాలు తీసుకోవడం .. నాలుక కరచుకోవడం జరుగుతోంది. అయితే ఇన్నాళ్లకు ఎలాన్ మస్క్ మంచి పనిచేశారని యూజర్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. యూజర్లకు తమ కంటెంట్ నుంచి డబ్బు సంపాదించుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లు మస్క్ ప్రకటించారు. లాంగ్ లెంగ్త్ వీడియోలతో పాటు మరేలాంటి దానికైనా సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్ ద్వారా డబ్బులు ఆర్జించుకోవచ్చని ఆయన సూచించారు. ఇందుకోసం సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘‘మానిటైజ్’’ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే సరిపోతుందని వెల్లడించారు. అయితే ప్రస్తుతానికి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోనే ఈ అవశం వుందని మస్క్ తెలిపారు. త్వరలోనే ఇతర దేశాలకు దీనిని విస్తరిస్తామని ఆయన పేర్కొన్నారు.

12 నెలల పాటు యూజర్ల ఆదాయం ముట్టుకోమన్న మస్క్ :

కంటెంట్ ద్వారా యూజర్లు సంపాదించిన డబ్బు నుంచి వచ్చే 12 నెలల పాటు ట్విట్టర్ ఏం తీసుకోబోదని ఆయన పేర్కొన్నారు. అంటే వినియోగదారులకు 70 శాతం వరకు ఆదాయం వస్తుందని అంచనా. ట్విట్టర్‌కు వస్తున్న ఆదాయంలో అత్యాధిక శాతం ఐఓఎస్, అండ్రాయిడ్‌ల యాప్ స్టోర్ ఫీజు కిందే వస్తోంది. వెబ్‌లో అయితే 92 శాతం వరకు ఆదాయం వినియోగదారులకు వస్తుందని ఎలాన్ మస్క్ స్పష్టం చేశారు. ఇందుకోసం యూజర్లకు ట్విట్టర్‌ సహకరిస్తుందని ఆయన తెలిపారు.

ట్విట్టర్‌లో సమూల మార్పులు :

ఫేస్‌బుక్ , యూట్యూబ్ రీల్స్‌కు మార్కెట్‌లో మంచి గిరాకీ వున్న నేపథ్యంలో ట్విట్టర్‌లో సమూల మార్పులు చేస్తున్నారు మస్క్. ఆయన తాజా నిర్ణయం ట్విట్టర్ సంస్థకు, వినియోగదారులకు రాబోయే రోజుల్లో మంచి ఆదాయ వనరుగా వుపయోగపడుతుంది.