ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపు.. యూనిట్‌కి ఎంత, ఎప్పటి నుంచి అమలంటే..?
- IndiaGlitz, [Wednesday,March 30 2022]
తెలంగాణ బాటలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సామాన్యుల నడ్డి విరగ్గొట్టేందుకు రెడీ అయ్యింది. ఈ మేరకు కరెంట్ ఛార్జీలను పెంచుతూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. 30 యూనిట్ల వరకు యూనిట్‌కు 45 పైసలు, 31 నుంచి 75 యూనిట్ల వరకు యూనిట్‌కు 91 పైసలు పెంచారు. 76 నుంచి 125 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ. 1.40 పైసలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 126 నుంచి 225 యూనిట్ల వరకు రూ. 6 , 226 నుంచి 400 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ. 8.75 పైసలు , 400 యూనిట్లకు పైగా ఉన్నవాటికి యూనిట్‌కు రూ. 9.75 పైసలు ప్రభుత్వం ఛార్జీలను పెంచింది.
తిరుపతిలో విద్యుత్ ఛార్జీల టారిఫ్‌ను ఏపీఈఆర్‌సీ ఛైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డి విడుదల చేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విద్యుత్ చార్జీల ఉత్తర్వులను ఏపీఈఆర్సీ సభ్యులు ఠాకూర్ రామ్ సింగ్, రాజగోపాల్ రెడ్డితో కలిసి ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు. కేటగిరీలను రద్దు చేసి 6 స్లాబ్‌లను తీసుకొస్తున్నామని.. ధరలు పెంచడం బాధాకరంగా ఉన్నా ప్రస్తుత పరిస్ధితుల్లో తప్పడం లేదని నాగార్జున రెడ్డి చెప్పారు. విద్యుత్ సంస్థల మనుగడ కోసమే గృహ వినియోగదారులకు విద్యుత్ ఛార్జీలు పెంచాల్సి వచ్చిందన్నారు. 20 ఏళ్ల తర్వాత విద్యుత్ ఉత్పత్తి ఖర్చు పెరిగిపోవడంతోనే ఛార్జీలు పెంచి వినియోగదారులపై భారం మోపాల్సి వచ్చిందని నాగార్జున రెడ్డి పేర్కొన్నారు.
కాగా కొద్దిరోజుల క్రితం.. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంపునకు టీఎస్ఈఆర్‌సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) ఛైర్మన్ టి.శ్రీరంగారావు కీలక ప్రకటన చేశారు. 2022-23 ఏడాదికి డిస్కమ్‌లు ప్రతిపాదించిన రెవెన్యూ గ్యాప్ రూ.16 వేల కోట్లని..కానీ, రూ.14,237 కోట్ల రెవెన్యూ గ్యాప్‌ను కమిషన్ ఆమోదించిందని శ్రీరంగారావు అన్నారు. రెవెన్యూ అవసరాలు రూ.53 వేల కోట్లుగా ఏఆర్‌ఆర్ ప్రతిపాదించగా.. కమిషన్ రూ.48,708 కోట్లు ఆమోదించిందని ఆయన చెప్పారు. గృహ వినియోగదారులకు యూనిట్‌కు 50 పైసలు, పరిశ్రమలకు యూనిట్‌పై రూపాయి పెంచుతున్నట్లు శ్రీరంగారావు పేర్కొన్నారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి అని టీఎస్ఈఆర్సీ ఛైర్మన్ తెలిపారు.