ఏపీలో పలువురు ఉన్నతాధికారులపై ఈసీ బదిలీ వేటు
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐదుగురు ఎస్పీలు, ఓ ఐజీ, ముగ్గురు కలెక్టర్లపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. బదిలీ అయిన అధికారుల్లో ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి , పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, చిత్తూరు ఎస్పీ జాషువా, అనంతపురం ఎస్పీ అన్బురాజన్, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి, గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు ఉన్నారు. అలాగే ఐఏస్ అధికారుల్లో కృష్ణా జిల్లా ఎన్నికల అధికారి రాజబాబు, అనంతపురం ఎన్నికల అధికారి గిరీజా, తిరుపతి ఎన్నికల అధికారి లక్ష్మీషాలను కూడా బదిలీ చేసింది.
బదిలీ అయిన అధికారులు ఎన్నికలు పూర్తయ్యే వరకూ విధుల్లో ఉండకూడదని స్పష్టం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మీనా సీఎస్, డీజీపీకి పంపారు. బదిలీ అయిన వారి స్థానంలో కొత్తవారి భర్తీకి ముగ్గురు ఆఫీసర్లతో ప్యానల్ పంపాలని సూచించారు. కాగా ఈ అధికారులు వైసీపీ నేతలకు అనుకూలంగా.. ప్రతిపక్ష నేతలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష నాయకుల ఫిర్యాదులతో ఎన్నికల సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
కాగా రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత పల్నాడు జిల్లా చిలూకలూరిపేటలో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్న బహిరంగసభలో గందరగోళం ఏర్పడిన సంగతి తెలిసిందే. భద్రతా వైఫల్యాలపైనా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ సభను విఫలం చేయడానికి ఎస్పీలు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీరియస్ అయిన కేంద్ర ఎన్నికల సంఘం సీఈవోను నివేదిక కోరింది. ఇదే సమయంలో ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు, నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డలో రాజకీయ హత్యలు చోటు చేసుకున్నాయి. పల్నాడు జిల్లాలోని మాచర్లలో దాడులు చోటు చేసుకున్నాయి.
ఈ మూడు ఘటనలను ఈసీ చాలా సీరియస్‌గా తీసుకుంది. హింసను అరికట్టడంలో ఎందుకు విఫలమయ్యారో వివరణ ఇవ్వాలని మూడు జిల్లాల ఎస్పీలను ఆదేశించింది. దీంతో వారు సీఈవో ముందు స్వయంగా హాజరై వివరణ ఇచ్చారు. అయితే పల్నాడు, ప్రకాశం ఎస్పీలు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో బదిలీ వేటు వేసింది. వీరితో పాటు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలతో కృష్ణా, అనంతపురం, తిరుపతి జిల్లాల కలెక్టర్లపైనా చర్యలు తీసుకుంది. ఎన్నికలు పూర్తి అయ్యే వరకూ ఈ అధికారులకు ఎన్నికల సంబంధిత విధులు అప్పగించవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments