పంజాబ్ ఎన్నికలు వాయిదా.. ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ..!!
Send us your feedback to audioarticles@vaarta.com
మినీ ఎన్నికల సంగ్రామంగా చెబుతున్న 5 రాష్ట్రాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈ రాష్ట్రాల్లోని అధికార పార్టీలు మరోసారి అధికారాన్ని అందుకోవాలని కృతనిశ్చయంతో వుండగా.. ప్రతిపక్షాలు మాత్రం ఈసారి సత్తా చాటాలని పావులు కదుపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అభ్యర్ధుల కోసం వేట సాగిస్తున్నాయి.
అయితే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీని మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎలక్షన్ తేదీని మార్చాలంటూ అధికార కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశాయి. ఈసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. పంజాబ్‌లో ఫిబ్రవరి 14న ఒకే విడతలో పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే ఫిబ్రవరి 16న సిక్కులు అత్యంత పవిత్రంగా జరుపుకునే గురు రవిదాస్ జయంతి ఉంది. ఇందుకు సంబంధించిన ఉత్సవాలు సైతం ముందే ప్రారంభమవుతాయి.
దీనికి తోడు గురు రవిదాస్ జయంతి నేపథ్యంలో లక్షలాది మంది భక్తులు ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసికి వెళ్తారని పార్టీలు చెబుతున్నాయి. దీంతో ప్రజలు ఓటు వేసే అవకాశం కోల్పోతారని ఎన్నికల సంఘానికి తెలిపాయి. ఈ పరిస్థితులను దృష్టిలో వుంచుకుని పోలింగ్ తేదీని వారం పాటు వాయిదా వేయాలని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్నీ ఈసీని కోరారు. కాంగ్రెస్‌తో పాటు బీఎస్పీ, బీజేపీ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల తేదీ వాయిదాపై సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీలో సమావేశమై నిర్ణయం తీసుకోనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments