ఎన్నికల అధికారులపై హత్య కేసు నమోదు చేయాలి: మద్రాసు హైకోర్టు
Send us your feedback to audioarticles@vaarta.com
పలు రాష్ట్రాల్లో కరోనా ఒక్కసారిగా తీవ్ర స్థాయిలో విజృంభించడానికి ఎన్నికలు కూడా కారణమయ్యాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విస్తృతమైన ప్రచారం.. సోషల్ డిస్టెన్స్ పాటించకపోవడం కారణంగా తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో కరోనా తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందింది. దీంతో తాజాగా మద్రాసు హైకోర్టు సోమవారం నాడు కేంద్ర ఎన్నికల సంఘంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయింది. దేశంలో రెండో దశ కోవిడ్ వ్యాప్తికి ఈసీదే బాధ్యతని పేర్కొంది. ఎన్నికల అధికారులపై హత్య కేసులు నమోదు చేయాలంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసింది.
ఎన్నికల అధికారులపై హత్య కేసులు నమోదు చేయాలని... విధులను సక్రమంగా నిర్వహించడంలో వైఫల్యం చెందడంపై ప్రాసిక్యూట్ చేయాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కరోనా వేళ ఎన్నికల ర్యాలీలను ఈసీ నిరోధించలేకపోయిందని, రాజకీయ పార్టీలు కోవిడ్ నిబంధనలు, ప్రోటాకాల్స్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నా మిన్నకుండిపోయిందని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఓట్ల లెక్కింపు రోజైనా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోర్టు సూచించిది. ఇందుకు సంబంధించిన ప్రణాళిక సమర్పించాలని ఆదేశించింది. 30వ తేదీలోగా ఓట్ల లెక్కింపు ప్రణాళిక ఇవ్వకుంటే తమిళనాడులో ఓట్ల లెక్కింపు ఆపేస్తామని హెచ్చరించింది.
కరోనా వైరస్ సెకండ్ వేవ్‌కు మీదే ఏకైక బాధ్యత అని అందుకే ఎన్నికల అధికారులపై హత్య కేసు నమోదు చేయాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ సాంజిట్ బెనర్జీ వ్యాఖ్యానించారు. ప్రచారాల వేళ వేరే గ్రహంలో ఉన్నారా? అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజారోగ్యానికి ఎంతో ప్రాముఖ్యత ఉందన్న విషయాన్ని రాజ్యాంగబద్ద సంస్థలు గుర్తుంచుకోవాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. కనీసం కోవిడ్ నిబంధనలు పాటించేలా కచ్చితంగా ఎన్నికల సంఘం సరైన ప్రణాళికలు అమలు చేయకపోతే మే 2వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపును నిలిపివేస్తామని హైకోర్టు హెచ్చరించింది. ఈనెల 6న ఒకే విడతలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. మే 2న ఓట్ల లెక్కింపు జరగనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments