Modi, Rahul: ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలకు ఈసీ నోటీసులు
Send us your feedback to audioarticles@vaarta.com
దేశంలో ఎన్నికల సమరం వాడివేడిగా జరుగుతోంది. ఒకరిపై మరొకరు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. అయితే ఈ విమర్శలు కొన్నిసార్లు హద్దులు దాటుతున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని అదుపులో పెట్టాల్సి వస్తోంది. తాజాగా ఏకంగా ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కూడా ఈసీ నోటీసులు జారీ చేసింది. తొలిసారి ఉల్లంఘనగా భావిస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేలకు నోటీసులు ఇచ్చింది. ఏప్రిల్ 29వ తేదీ ఉదయం 11 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
ఇటీవల రాజస్థాన్‌లోని బన్స్వారాలో జరిగిన ఎన్నికల సభలో మోదీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజల సంపదను ముస్లిం మైనార్టీలకు పంచి పెడుతుందని ఆరోపించారు. అంతేకాకుండా మహిళల మంగళసూత్రాలను కూడా వదిలిపెట్టదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
ఇక దేశంలో పేదరికం పెరిగిపోయిందంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ కూడా ఈసీకి ఫిర్యాదుచేసింది. భాష, మతం పేరుతో దక్షిణ, ఉత్తరాది రాష్ట్రాలకు చిచ్చు పెట్టే కుట్ర చేస్తున్నారంటూ పేర్కొంది. ఇక తాను దళితుడిననే కారణంతో అయోధ్య ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానించలేదంటూ మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలపైనా ఫిర్యాదు చేసింది.
ఈ ఫిర్యాదులను పరిశీలించిన ఈసీ రెండు పార్టీల అధ్యక్షులకు నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ చేసిన సమయంలో పార్టీలకు ఎన్నికల సంఘం కీలక సూచనలు చేసింది. పార్టీ అభ్యర్థులు, స్టార్ క్యాంపెయినర్లు చేసే వ్యాఖ్యలు, ప్రవర్తించే ప్రవర్తనకు సంబంధిత రాజకీయ పార్టీలే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. ఉన్నత పదవుల్లో ఉన్న వారు ఇలాంటి విద్వేష ప్రసంగాలు చేస్తే అవి ప్రజల్లో తీవ్ర పరిణామాలకు దారితీస్తాయని సూచించింది. ప్రచారంలో బాధ్యతగా వ్యవహరించాలని వెల్లడించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments