Janasena Party : పవన్ పార్టీకి ఊరట.. గాజు గ్లాసు జనసేనదే, కానీ ఇక్కడో మెలిక

  • IndiaGlitz, [Sunday,June 25 2023]

మరికొన్ని నెలల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జనసేన పార్టీకి ఎన్నికల సంఘం శుభవార్త చెప్పింది. జనసేనకు గాజుగ్లాసు గుర్తును కొనసాగిస్తూ ఏపీ ఎన్నికల కమీషన్ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు.. జనసేనను రిజర్వ్‌డ్ సింబల్ కలిగిన రిజిస్టర్డ్ పార్టీల జాబితాలో వుంచింది. ఈసీ నిర్ణయం ద్వారా గాజు గ్లాసు విషయంలో గత కొద్దిరోజులుగా జరుగుతున్న వివాదానికి తెరపడినట్లయ్యింది. వారాహి విజయ యాత్రలో పవన్ కళ్యాణ్ తన చెప్పులు పోయాయంటూ వైసీపీ నేతలపై సెటర్లు వేశారు. దీనికి అధికార పార్టీ నేతలు స్పందిస్తూ.. చెప్పులు పోతే పోయాయి కానీ.. ముందు పార్టీ గుర్తు పోయింది చూసుకో అంటూ కౌంటర్లు ఇస్తున్నారు. ఇది జనసేన కేడర్‌కు ఇబ్బందికరంగా మారింది. ఇలాంటి పరిస్ధితుల్లో ఈసీ తీసుకున్న నిర్ణయంతో జనసైనికులకు ఊరట కలిగింది. మరోవైపు ఈసీ నిర్ణయంపై జనసేన పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన ద్వారా ఎన్నికల సంఘానికి ధన్యవాదాలు తెలియజేసింది.

అయితే ఇక్కడ టెక్నికల్‌గా మరో ఇబ్బంది వుంది. జనసేన పార్టీకి ఈసీ గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది అసెంబ్లీ ఎన్నికలకు కాదు. రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగితే.. అప్పుడు జనసేన పోటీచేస్తే, ఆ సమయంలో ఆ పార్టీ అభ్యర్ధులు గాజు గ్లాస్ గుర్తుపై పోటీ చేయవచ్చు. కానీ అసెంబ్లీ ఎన్నికల విషయానికి వచ్చే సరికి.. జనసేన గుర్తుపై అంతిమ నిర్ణయం కేంద్ర ఎన్నికల సంఘానిదే.

జనసేనకు ప్రాంతీయ పార్టీ గుర్తింపు రావాలంటే :

ఏదైనా పార్టీకి ప్రాంతీయ పార్టీగా ఈసీ గుర్తింపు లభించాలంటే ఎన్నికల్లో పోలైన ఓట్లలో ఆరు శాతం, రెండు స్థానాలను గెలుచుకోవాలి. కానీ 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన వీటిని సాధించలేకపోయింది. ఆరు శాతం ఓట్లు సాధించినప్పటికీ.. కేవలం ఒకే ఒక్క స్థానాన్ని కైవసం చేసుకుంది. మరోచోట ఆ పార్టీ అభ్యర్ధి ఎమ్మెల్యేగా గెలిచి వుంటే జనసేన ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందేది. అలాగే ఏపీలోని 25 లోక్‌సభ స్థానాల్లో ఒక్క చోట గెలిచినా ప్రాంతీయ పార్టీ హోదా దక్కేది. ఇవేవి జరగని కారణంగా జనసేనకు గతంలో కేటాయించిన గాజు గ్లాసు గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్స్ కేటగిరీలో చేర్చింది.