YS Jagan : వైసీపీకి శాశ్వత అధ్యక్షుడుగా అంటే కుదరదు.. జగన్‌కు కేంద్ర ఎన్నికల సంఘం షాక్
- IndiaGlitz, [Thursday,September 22 2022]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నిక చెల్లదని స్పష్టం చేసింది. ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీకీ శాశ్వత అధ్యక్షుడు, శాశ్వత పదవులు వర్తించవని ఈసీ తేల్చిచెప్పింది. దీనికి సంబంధించి బుధవారం ఆదేశాలు చేసింది. వీటిని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డికి పంపింది. ఎన్నికల సంఘం నియామవళికి అంగీకారం తెలిపిన తర్వాతే మనదేశంలోని పార్టీల రిజిస్ట్రేషన్ వ్యవహారాలను జరుగుతాయని.. ఒక పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా నియమించడం నిబంధనలకు విరుద్ధమని ఈసీ తెలిపింది. దీనికి సంబంధించి వైసీపీకి పలుమార్లు ఉత్తరాలు రాసినా.. స్పందన రాలేదని ఎన్నికల సంఘం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. శాశ్వత అధ్యక్షుడి నియామకానికి సంబంధించి పార్టీలో అంతర్గతంగా విచారణ జరిపి ఆ నివేదికను తమకు పంపాల్సిందిగా విజయసాయిరెడ్డిని ఈసీ ఆదేశించింది.
వైసీపీ ప్లీనరీలో పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నిక:
ఈ ఏడాది జూలైలో గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో జరిగిన వైసీపీ ప్లీనరీ సందర్భంగా ఆ పార్టీకి శాశ్వత అధ్యక్షుడి వ్యవహారం తెరపైకి వచ్చింది. నాటి ప్లీనరీ తొలి రోజునే వైసీపీకి గౌరవాధ్యక్షురాలిగా వున్న వైఎస్ విజయమ్మ ఆ పదవి నుంచి తప్పుకున్నారు. తర్వాత పలు సవరణలపై తీర్మానం చేసిన వైసీపీ కార్యవర్గం.. పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్‌ను ఎన్నుకున్నట్లు తెలిపింది. దీనిపై మీడియాలో, వార్తాపత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఈసీ స్పందించి.. ఈ మేరకు జగన్ శాశ్వత అధ్యక్షుడి నియామకం చెల్లదని స్పష్టం చేసింది.