తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం బంద్.. మూగబోయిన మైకులు..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు రాష్ట్రాల్లో రెండున్నర నెలలుగా మార్మోగిన మైకులు ఒక్కసారిగా మూగబోయాయి. నేటితో ఎన్నికల ప్రచారానికి తెర పడింది. ఏపీలో అధికారం దక్కించుకునేందుకు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కూటమిలు హోరాహోరి ప్రచారం నిర్వహించాయి. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. అటు తెలంగాణలోనూ ప్రచారం బంద్ అయింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు రాజకీయ పార్టీలు చివరి నిమిషం వరకూ సర్వశక్తులను ఒడ్డాయి. రాష్ట్ర స్థాయి నేతలతో పాటు అగ్రనేతలు కూడా క్షేత్రస్థాయిలో దిగి ప్రచారం చేశారు.
ఇప్పుడు ప్రచారపర్వం ముగిసిపోవటంతో.. ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాలు మూగబోయాయి. కళ్యాణ మండపాలు, కమ్యూనిటీ హాల్స్, హోటల్స్‌లలో ఉన్న ఇతర జిల్లాల వ్యక్తులు నియోజకవర్గాల నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. ఇక బల్క్ మెసేజ్‌లు, ఐవీఆర్‌ఎస్ కాల్స్, ఐవీఆర్‌ఎస్ సర్వేలు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రకటనలు, సోషల్ మీడియా ప్రకటనలు అన్నీ బంద్ అయ్యాయి. అయితే ప్రింట్ మీడియాలో ప్రకటనలకు మాత్రం అనుమతి ఉంటుంది. మరోవైపు ఎన్నికలు జరగనున్న ప్రాంతాల్లో ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం సాయంత్రం 6 గంటల వరకు 144 సెక్షన్ అమలు అవుతుంది.
దీంతో నలుగురి కంటే అధికంగా వ్యక్తులు బయట గుంపుగా తిరగకూడదు. తిరిగితే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారు. అలాగే జూన్ 1వ తేదీ వరకు సాయంత్రం 6.30 నిమిషాల వరకు ఎగ్జిట్ పోల్స్ బ్యాన్ ఉంది. ఇక మద్యం దుకాణాలు కూడా మూతపడ్డాయి. ఎన్నికల నిబంధనల ప్రకారం 48 గంటలు మద్యం దుకాణాలు మూసివేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే హైదరాబాద్‌లో స్థిరపడిన ఓటర్లంతా ఓట్ల పండుగ కోసం ఊర్లకు తరలివెళ్తున్నారు. రెండు రాష్ట్రాల్లో మే 13వ తేదీన ఉదయం 7 గంటల ఉంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం కొన్ని చోట్ల సాయంత్ర 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ జరగనుంది. ఇక జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments