Election Campaign:సాయంత్రంతో ముగియనున్న ప్రచారం.. ప్రలోభాలపర్వం మొదలు..
- IndiaGlitz, [Tuesday,November 28 2023]
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి ఘట్టానికి చేరుకున్నాయి. ఇవాళ సాయంత్ర 5 గంటల తర్వాత మైకులు మోత బంద్ కానుంది. మావోయిస్టుల ప్రభావం ఉన్న 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4గంటల వరకే ప్రచారం జరగనుంది. దీంతో ఇతర ప్రాంతాల నాయకులు వారి స్వస్థలాలకు వెళ్లిపోవాల్సి ఉంటుంది గత నెల 9న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన దగ్గరి నుంచి 40 రోజుల పాటు రాష్ట్రంలో ప్రచారం హోరెత్తింది. ప్రతి గల్లీలో అన్ని పార్టీల కార్యకర్తలు తమ నాయకులు తరపున పాటలతో మారుమోగించారు. ఇక అగ్ర నేతలు సభలు, రోడ్‌షోలు, కార్నర్ మీటింగులతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రచార రథాలు పెట్టి ఊరూరా ఊదరగొట్టారు.
ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే 144 సెక్షన్ అమల్లోకి వస్తుంది. ఇవాళ(మంగళవారం) సాయంత్రం 5 గంటల నుంచి ఎల్లుండి(గురువారం) సాయంత్రం 6 గంటల వరకు 48 గంటల పాటు మద్యం దుకాణాలు కూడా మూతపడనున్నాయి. ప్రచారపర్వం ముగియనుండడంతో ప్రలోభాల పర్వం షూరూ కానుంది. ఓటర్లను ఆకర్షించేందుకు డబ్బుల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు. ఓటుకు రూ.2వేలు.. కొన్నిచోట్లు రూ.3వేలు కూడా పంచుతున్నట్టు తెలుస్తోంది. కీలక నేతలు బరిలో ఉన్న నియోజకవర్గాల్లో అయితే డబ్బు, మద్యం పంపిణీ విచ్చలవిడిగా జరుగుతున్నట్టు సమాచారం.
ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్-కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు కనిపిస్తోంది. హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్‌ఎస్ పట్టుదలతో ఉంటే.. ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో ఇరు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. ఇక బీజేపీ కూడా తన వంతు గట్టిగానే ప్రచారం నిర్వహించింది. గత ఎన్నికల్లో కంటే ఈసారి బలం పుంజుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు పోలింగ్‌కు సమయం దగ్గర పడటంతో ఎన్నికల అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. డిసెంబర్ 3న తెలంగాణతో పాటు మిగిలిన నాలగు రాష్ట్రాల కౌంటింగ్ కూడా జరగనుంది.