ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఎన్నికల ప్రచారం: జనసేన

  • IndiaGlitz, [Thursday,November 19 2020]

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికలకు జనసేన పార్టీ సమాయత్తమవుతోంది. ఈ మేరకు తమ పార్టీ నుంచి 45 - 60 మంది అభ్యర్థులను బరిలోకి దింపాలని యోచిస్తోంది. తమ పార్టీ తరుఫున పోటీ చేయబోయే కార్పొరేటర్ అభ్యర్థుల లిస్టును శుక్రవారం విడుదల చేయనున్నట్టు జనసేన పార్టీ వెల్లడిస్తూ ఓ ప్రకటనను జనసేన పార్టీ విడుదల చేసింది. ‘‘డిసెంబర్ 1న జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బలమన ప్రభావం చూపి, ప్రజల పక్షాన దాదాపు 45-60 డివిజన్లలో జనసేన తరుఫున కార్పొరేటర్ అభ్యర్థులుగా నిలబడేందుకు సిద్ధంగా ఉన్నారు. దీనికి తగినట్లుగా ఎన్నికల్లో నిలబడే జనసేన అభ్యర్థుల తొలి జాబితాను రేపు విడుదల చేయనున్నాం.

గత రెండు రోజులుగా హైదరాబాద్, ప్రశాసన్ నగర్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయానికి విచ్చేసి ఆశావహ అభ్యర్థులు తమ బయోడేటాను సమర్పించి మార్పు కోసం ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపించారు. వీరిలో విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, ఇంజనీర్లు, పట్టభద్రులు, జనసేన నాయకులు, వీర మహిళలు, క్రియాశీలక జనసైనికులు ఉన్నారు. వందలాది అభ్యర్థుల బయోడేటాలు, వారి సామర్థ్యాలను పరిశీలించిన తర్వాత దాదాపు 45 నుంచి 60 స్థానాల్లో జనసేన అభ్యర్థులను నిలిపేందుకు నిర్ణయించడం జరిగింది.

రేపు అభ్యర్థుల తొలి జాబితా..!

రేపు సాయంత్రం అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనున్నాం. శుక్రవారం నాడు తుది జాబితాను విడుదల చేయడమే కాకుండా, సత్వరమే నామినేషన్ ప్రక్రియను పూర్తి చేసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నాం. రాజకీయ విమర్శలు కాకుండా ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఈ ఎన్నికల ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నాం. గ్రేటర్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ప్రజల గొంతుగా జనసేన పార్టీని నిలబెట్టేందుకు గ్రేటర్ జన సైనికులందరూ కష్టపడాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం’’ అని జనసేన పార్టీ వెల్లడించింది.