Ee Maya Peremito Review
తొలిసారి తెరపై హీరోగా కనిపించాలనే తపన ఉన్న హీరోల్లో ఎక్కువ శాతం మంది ప్రేమకథాచిత్రాల వైపే మొగ్గు చూపుతారు. అలా ప్రేమకథా చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన డెబ్యూ హీరో రాహుల్ విజయ్. మూడు దశాబ్దాలకు పైగా తెలుగులో ఎందరో స్టార్ హీరోల సినిమాలకు యాక్షన్ సన్నివేశాలను కంపోజ్ చేసిన విజయ్ మాస్టర్ కొడుకే రాహుల్ విజయ్. ఇతను హీరోగా నటించిన తొలి చిత్రం `ఈ మాయ పేరేమిటో`. ఇదే సినిమాతో విజయ్ మాస్టర్ తనయ దివ్య నిర్మాతగా పరిచయం అయ్యారు. మరి ఈ మాయ పేరేమిటో సినిమా మాయ చేసి ప్రేక్షకులను మెప్పించిందా లేదా? అని తెలుసుకోవాలంటే కథలోకి వెళదాం...
కథ:
చదువు పూర్తయిన ఏ పనీ చేయకుండా స్నేహితులతో జాలీగా తిరిగే కుర్రాడు శ్రీరామచంద్రమూర్తి అలియాస్ చందు( రాహుల్ విజయ్). ఎంత ఖాళీగా తిరిగినా.. ఎవరైనా కష్టాల్లో ఉంటే తన వంతు సహకారాన్ని అందించడానికి చందు ఎప్పుడూ ముందుంటాడు. అతని మంచితనం నచ్చడంతో శీతల్ జైన్(కావ్యాథాపర్) అతన్ని ప్రేమిస్తుంది. అతని గురించి పూర్తి వివరాలు సేకరించే సమయంలో.. చందుకి ఎవరో అమ్మాయి తన గురించి ఆరా తీస్తుందని తెలిసి.. ఆమెను వెతుకుతాడు. ఓ సందర్భంలో ఇద్దరూ కలుసుకుంటారు. ప్రేమికుల్లాగా కలిసి తిరుగుతుంటారు. వీరి ప్రేమ విషయం తెలిసిన శీతల్ తండ్రి (మురళీ శర్మ) బాధ్యతగా ఉంటేనే తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తానని అంటాడు. దాంతో చందు ఓ రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా జాయిన్ అవుతాడు. అక్కడ పనుల ఒత్తిడి కారణంగా శీతల్‌ను పెద్దగా పట్టించుకోడు. దాంతో ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. చందు మారిపోయాడని భావించిన శీతల్ అతనికి బ్రేకప్ చెప్పేస్తుంది. అప్పుడు చందు ఏం చేస్తాడు? అతని ప్రేమ సక్సెస్ అవుతుందా? చందు, శీతల్ ఒక్కటవడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
సమీక్ష:
తొలి చిత్రమే అయినా.. హీరోగా ప్రొజెక్ట్ కావడానికి రాహుల్ విజయ్ ఎనిమిదేళ్లు కష్టపడి ట్రయినింగ్ తీసుకున్నాడు. అతని కష్టం తెరపై కనపడుతుంది. రెండు మూడు సినిమాల అనుభవమున్న హీరోలా నటించాడు. ఇక కావ్యా థాపర్ గ్లామర్, నటన పరంగా శీతల్ అనే ఉత్తరాది అమ్మాయి పాత్రలో చక్కగా నటించింది. ఇక హీరోయిన్ తండ్రిగా నటించిన మురళీ శర్మ ఆ పాత్రను సునాయసంగా చేసేశాడు. అయితే ఈ పాత్రకున్న ఇంపార్టెన్స్ కూడా హీరో తల్లిదండ్రులుగా నటించిన రాజేంద్ర ప్రసాద్, ఈశ్వరీరావ్‌లకు సినిమాలో కనపడదు. ఇక హీరో స్నేహితులుగా నటించిన సత్యం రాజేష్, భద్రమ్, జోష్ రవి అందరూ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. ఇక కొత్త హీరోను పరిచయం చేసేటప్పుడు కథకు ఉన్న ప్రాముఖ్యత ముఖ్యం. కొన్నిసార్లు కథ బావున్నా నటీనటులు ఫెయిలవుతారు. కానీ సినిమాలో కథే లేదు. లవ్ స్టోరీ అంటే హీరో మధ్య తరగతి.. హీరోయిన్ రిచ్.. అనే భావనలోనే దర్శకుడు కథను స్టార్ట్ చేసేసుకుని కథను రాసుకున్నాడు. హీరో, హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ సింకింగ్‌గా అనిపించదు. ఇక పాటల సంగతి సరేసరి!! ఇలాంటి మ్యూజిక్‌నా మణిశర్మ అందించాడు అనిపిస్తుంది. ఇక డైలాగ్స్ సంగతి సరేసరి!. సెకండాఫ్ తోపోల్చితే ఫస్టాఫ్ బెటర్‌గా అనిపిస్తుంది. ముఖ్యంగా నవీన్‌నూలి సెకండాఫ్ ఎడిటింగ్‌లోక్లారిటీ మిస్ అయ్యింది. సినిమా మొత్తంపై హీరో పెర్‌ఫార్మెన్స్‌తో పాటు శ్యామ్ కె.నాయుడు కెమెరా పనితనం, ప్రొడక్షన్ వేల్యూస్ బావున్నాయి.
బోటమ్ లైన్:
హీరోలో మంచి విషయం ఉంది. ఈజ్‌తో నటన, డాన్సులను చేశాడు. అయితే దర్శకుడు రాము కొప్పల హీరోను ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యేలా సినిమాను తెరకెక్కించడంలో ఫెయిల్ అయ్యాడని క్లియర్‌గా తెలుస్తుంది. హీరోగా రాహుల్ బాగా నటిస్తాడు, డాన్సులు బాగా చేస్తాడని చెప్పుకోడానికి మాత్రమే `ఈ మాయ పేరేమిటో` సినిమా పనికొస్తుంది
Read Ee Maya Peremito Movie Review in English
- Read in English