Navdeep:టాలీవుడ్‌లో ప్రకంపనలు రేపుతున్న డ్రగ్స్ వ్యవహారం.. హీరో నవదీప్‌కు ఈడీ నోటీసులు

  • IndiaGlitz, [Saturday,October 07 2023]

డ్రగ్స్ వ్యవహారం తెలుగు సినీ ఇండస్ట్రీలో మరోసారి ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసులో తెలుగు హీరో నవదీప్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 10న ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని తెలిపారు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్‌కు నోటీసులు ఇచ్చినట్లు వెల్లడించారు. మాదక ద్రవ్యాల కేసులో ఆయనకు ఇప్పటికే రెండు సార్లు ఈడీ నోటీసులు పంపినా విచారణకు హాజరు కాలేదు. ఇప్పడు మూడోసారి నోటీసులు పంపారు. నైజీరియన్ డ్రగ్స్ ముఠాతో నవదీప్‌కు ఆర్థిక సంబంధాల విషయంలో విచారణ చేయనున్నారు.

నిందితుల కాల్‌ డేటాలో టాలీవుడ్ ప్రముఖుల పేర్లు..

2017లో నమోదైన డ్రగ్స్ కేసులో ఇప్పటికే రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, రానా దగ్గుబాటి, రవితేజ, ఛార్మి, ముమైత్‌ ఖాన్‌, తనీష్‌, నందు, తరుణ్‌లను విచారించారు. మరోవైపు సెప్టెంబర్ 23న మాదాపూర్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ పోలీసులు 6 గంటల పాటు నవదీప్‌ను విచారించిన సంగతి తెలిసిందే. తెలంగాణ నార్కోటిక్స్‌ బ్యూరో అధికారులు గుడిమల్కాపుర్‌ పోలీసులతో కలిసి సెప్టెంబరు 14న బెంగళూరుకి చెందిన ముగ్గురు నైజీరియన్స్‌, ఓ దర్శకుడితో పాటు నలుగురు వ్యక్తుల్ని అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుల ఫోన్ డేటా సాయంతో మరికొందరిని అదుపులోకి తీసుకుంటున్నారు. నిందితుల కాల్ డేటాలో టాలీవుడ్ ప్రముఖుల పేర్లు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వారిపై నిఘా పెట్టారు.

బెంగళూరులో ఉంటున్న నైజీరియన్ల నుంచి డ్రగ్స్ కొనుగోలు..

నిర్మాతలు ఉప్పలపాటి రవి, వెంకటరత్నారెడ్డిలకు నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ నేవీ ఉద్యోగి బాలాజీ, విశాఖపట్నానికి చెందిన రాంకిశోర్‌ ద్వారా డ్రగ్స్‌ చేరినట్లు గుర్తించారు. బెంగళూరులో ఉంటున్న నైజీరియన్ల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి సినీ, రాజకీయ ప్రముఖులకు విక్రయిస్తున్నట్లు తేల్చారు. ఇందులో భాగంగానే నవదీప్‌ను విచారించారు. దీంతో ఈడీ కూడా రంగంలోకి దిగింది. గతంలో రెండు సార్లు నోటీసులు ఇచ్చినా హాజరుకాకపోవడంతో ఈసారి మళ్లీ నోటిసులు ఇచ్చింది. ఈనెల 10న తప్పకుండా విచారణకు హాజరుకావాల్సిందేనని స్పష్టం చేసింది.