Kalvakuntla Kavitha:ఢిల్లీ లిక్కర్ స్కాం.. కవితకు ఈడీ నోటీసులు, తెలంగాణ తలవంచదన్న కేసీఆర్ కుమార్తె
Send us your feedback to audioarticles@vaarta.com
మహిళా దినోత్సవం వేళ బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ షాకిచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆమెకు బుధవారం ఈడీ నోటీసులు ఇచ్చింది. గురువారం తమ ఎదుట హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. ఇప్పటికే ఇదే కేసుపై కవితను సీబీఐ విచారించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఈడీ కూడా రంగంలోకి దిగడంతో బీఆర్ఎస్ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి హైదరాబాద్‌కు చెందిన అరుణ్ రామచంద్రపిళ్లైని మంగళవారం సుదీర్ఘంగా విచారించి, ఆపై అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా రిమాండ్ రిపోర్టులో కవితకు అరుణ్ బినామీ అని .. ఆమెకు ప్రతినిధిగా వ్యవహరించాడని ఈడీ ఆరోపించింది. సౌత్ గ్రూప్ అనుబంధం ఇండో స్పిరిట్స్ సంస్థలో కవిత తరపున పిళ్లై భాగస్వామిగా వ్యవహరించాడని ఈడీ పేర్కొంది. ఈ కుంభకోణం ద్వారా రూ.296 కోట్లు అక్రమంగా సంపాదించాడని ఈడీ ఆరోపించింది. అరుణ్ రామచంద్రపిళ్లైని అరెస్ట్ చేసిన గంటల్లోనే కవితకు నోటీసులు ఇవ్వడం కలకలం రేపింది.
10న మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ధర్నా చేయాలనుకున్నా :
కాగా.. తనకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై కవిత స్పందించారు. తాను ఈ నెల 10న మహిళా రిజర్వేషన్ బిల్లును డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ధర్నా చేయాలని భావించానని, ఇంతలోనే ఈడీ నోటీసులు వచ్చాయని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఎన్నటికీ తలవంచదని కవిత ట్వీట్ చేశారు. బాధ్యత గల పౌరురాలిగా తాను విచారణకు సహకరిస్తానని.. అయితే ధర్నాతో పాటు ముందుగా షెడ్యూల్ చేసుకున్న కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో విచారణ తేదీ మార్పుకు సంబంధించి న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు కవిత చెప్పారు. బీఆర్ఎస్‌ను గానీ, కేసీఆర్‌ను గానీ లొంగదీసుకోలేరని కవిత తేల్చిచెప్పారు. ప్రజల హక్కు కోసం నిర్భయంగా పోరాడుతూనే వుంటామన్నారు.
కవిత అరెస్ట్ అవుతారంటూ బీజేపీ నేతల వ్యాఖ్యలు :
ఇదిలావుండగా.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా అరెస్ట్ అయిన తర్వాత ... నెక్ట్స్ కవితేనంటూ గత కొద్దిరోజులుగా బీజేపీ నేతలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. వీటికి కవిత కూడా ధీటుగానే బదులిస్తున్నారు. ఈ నేఫథ్యంలో నిన్న అరుణ్ రామచంద్రపిళ్లైని అరెస్ట్ చేయడం , ఆ వెంటనే కవితకు కూడా ఈడీ నోటీసులు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout