Election Commission: ఎన్నికల ప్రచారంలో పిల్లలను ఉపయోగిస్తే కఠిన చర్యలు.. పార్టీలకు ఈసీ హెచ్చరిక..
Send us your feedback to audioarticles@vaarta.com
త్వరలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనన్ను తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రచారానికి సంబంధించి కీలక మార్గదర్శకాలు విడుదల చేసింది. చిన్న పిల్లలను ఎన్నికల ప్రచారానికి ఉపయోగించరాదని ఆదేశించింది. ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీలకు ఆదేశాలు జారీ చేసింది. పోస్టర్లు అంటించడం, కరపత్రాలు పంచడం, ర్యాలీల్లో నినాదాలు చేయించడం వంటి పనులు చేయించరాదని స్పష్టంచేసింది. అలాగే అభ్యర్థులు ప్రచారంలో చిన్న పిల్లలను ఎత్తుకోవడం, ప్రచార వాహనాలపై పిల్లలను ఎక్కించడం, పార్టీ జెండాలు ఇవ్వడం వంటి చేయకూడదని హెచ్చరించింది. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది.
అయితే పిల్లలు వారి తల్లిదండ్రుల సమక్షంలో ఏదైనా రాజకీయ నేత, అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే మాత్రం తమ మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లు కాదని తెలిపింది. ఇటీవల కాలంలో రాజకీయ నేతలు పిల్లలను తమ పార్టీల ప్రచారం కోసం వాడుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. రాబోయే ఎన్నికల్లో ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడంలో పార్టీ నేతలు క్రియాశీల భాగస్వాములు కావాలని కోరింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది.
అలాగే ఎన్నికల సిబ్బంది కూడా తమ కార్యకలాపాల్లో పిల్లలను ఉపయోగించకూడదని వివరించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, ఇతర సామాగ్రిని తీసుకెళ్లడానికి కొన్ని చోట్ల పిల్లలను ఉపయోగించుకంటున్నారని.. ఇలా చేస్తే జిల్లా ఎన్నికల అధికారులు వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని వెల్లడించింది. ప్రతి ఒక్కరూ బాల కార్మికుల చట్టాలను గౌరవించాలని చెప్పుకొచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు.
కాగా ఈనెలాఖరులోపు లేదా మార్చి మొదటి వారంలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనుంది ఈసీ. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో పర్యటించి ఎన్నికల ఏర్పాట్లు, ఓటర్ల జాబితాలపై అధికారులకు సూచనలు చేసింది. ఒకే జిల్లాలో మూడు సంవత్సరాలకు పైగా పనిచేస్తున్న అధికారులను ఇప్పటికే బదిలీ చేసింది. నగదు తరలించకుండా రాష్ట్రాల సరిహద్దుల్లో గస్తీ పెంచాలని ఆదేశించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పార్లమెంట్ స్థానాలతో పాటు ఏపీ, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. మొత్తం ఆరు లేదా ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ సిద్ధమైంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments