ఎన్నికల వేళ రాహుల్ గాంధీకి ఈసీ షాక్
- IndiaGlitz, [Friday,April 19 2019]
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహల్ గాంధీకి కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఝలక్ ఇచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నియోజకవర్గంలో రాహుల్ ఫొటోలతో కూడిన భారీ బ్యానర్లు ఏర్పాటు కావడంపై ఈసీ కన్నెర్రజేసింది. దీంతో రాహుల్‌కు ఈసీ నోటీసులు జారీచేసింది. ఈ వ్యవహారంపై లిఖితపూర్వకంగా జవాబు ఇవ్వాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. సరైన సమాధానం రాకపోతే చర్యలు తప్పవని ఈసీ హెచ్చరించింది!
నోటీసులెందుకంటే..!?
మేం అధికారంలోకి వస్తే దేశంలోని అత్యంత నిరుపేదలైన 20 శాతం మందికి(5 కోట్ల కుటుంబాలు-25 కోట్ల మంది ప్రజలు) న్యాయ్ పథకం కింద ఏటా రూ.72 వేలు ఇస్తామని రాహుల్ గతంలో ప్రకటించారు. దీనికి సంబంధించి ‘ఇప్పుడు న్యాయం జరుగుతుంది’ అనే నినాదాలు, రాహుల్ ఫొటోలతో కూడిన పోస్టర్లను కాంగ్రెస్ శ్రేణులు అమేథీలో దర్శనమిచ్చాయి. అయితే ఈ బ్యానర్లు, పోస్టర్లు పెట్టుకునేందుకు ఈసీ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకపోవడంతో అమేథీలో పర్యటించిన ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు వీటిని గుర్తించాయి. ఇందుకు సంబంధించిన పత్రాలు చూపాలని కాంగ్రెస్ కార్యకర్తలను కోరారు. కార్యకర్తల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో రాహుల్‌కు ఈసీ నోటీసులు జారీ చేసింది. అయితే ఈ వ్యవహారంపై రాహుల్ ఇంత వరకూ స్పందించలేదు.