Vikasit Bharat: కేంద్రానికి ఈసీ బిగ్ షాక్.. వికసిత్ భారత్ సందేశాలు ఆపాలని ఆదేశాలు..

  • IndiaGlitz, [Thursday,March 21 2024]

కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం బిగ్ షాక్ ఇచ్చింది. సోషల్ మీడియాలో వస్తున్న 'వికసిత్ భారత్' ప్రచారాన్ని వెంటనే ఆపాలని ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఇలా సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేయడం కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని తేల్చి చెప్పింది. తక్షణమే వాట్సాప్‌లో వస్తున్న ఈ మెసేజ్‌లను నిలిపివేయాలని ఆదేశిస్తూ కేంద్ర ఐటీ శాఖకు నోటీసులు జారీ చేసింది.

కొన్ని రోజులుగా దేశంలోని అందరి వాట్సాప్‌లలో ఈ వికసిత్ భారత‌కు సంబంధించిన మెసేజ్‌లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా మెసేజ్‌లు వస్తున్నాయని.. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని ఫిర్యాదులో పేర్కొన్నాయి. దీంతో ఆ ఫిర్యాదులను పరిగణలోకి తీసుకున్న ఈసీ..వాటిని తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఇక నుంచి వికసిత్ భారత్‌కు సంబంధించి ఎలాంటి వాట్సాప్ మెసేజ్‌లు పంపించవద్దని ఐటీ శాఖకు స్పష్టం చేసింది.

కాగా వికసిత్ భారత్ సంపర్క్ పేరుతో కేంద్ర ప్రభుత్వం గత కొన్ని రోజులుగా వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపిస్తోంది. ఇందులో ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పేరుతో ఒక లేఖను పంపిస్తున్నారు. గత 10 ఏళ్లుగా దేశంలోని 140 కోట్ల మంది భారతీయులు వివిధ పథకాల ద్వారా నేరుగా లబ్ధి పొందాని.. భవిష్యత్‌లో కూడా వారు ఈ పథకాల ఫలాలను అందుకుంటారని అందులో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించుకునేందుకు ప్రజల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ చాలా అవసరం అని చెప్పుకొచ్చారు. ఈ మేరకు సూచనలు, సలహాలు, ఫీడ్ బ్యాక్‌ను అందించాలని ఆ మెసేజ్‌లో ఉంది.