Telangana DGP:తెలంగాణ డీజీపీపై వేటు.. ఈసీ సంచలన నిర్ణయం..
- IndiaGlitz, [Sunday,December 03 2023]
తెలంగాణ ఫలితాల అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ పై సస్పెన్షన్ వేటు వేసింది. కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుండగానే టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డిని డీజీపీ హోదాలో కలవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఎన్నికల కోడ్ నిబంధనల ప్రకారం కౌంటింగ్ పూర్తి కాకుండానే రాజకీయ నేతలను కలవడం నిషేధమని తెలిపింది. తక్షణమే దీనిపై తమకు వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు డీజీపీ స్థానంలో సీనియర్ ఐపీఎస్ అధికారిని డీజీపీగా నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించింది. అలాగే ఐపీఎస్ అధికారులు సంజయ్ కుమార్, మహేష్ భగవ్‌తకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. కాగా ఇవాళ మధ్యాహ్నం రేవంత్ రెడ్డిని డీజీపీతో పాటు పలువురు ఐపీఎస్ అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. రేవంత్ సీఎం అభ్యర్థి కావడంతో ఆయనకు కల్పించే భద్రతపై ఈ మేరకు చర్చించారు.
ఇదిలా ఉంటే కొన్ని రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకానుంది. డిసెంబర్ 9వ తేదీ లోపు ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సీఎం ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు ఇండియా కూటమిలో ముఖ్య నేతలు హాజరుకానున్నారు. దీంతో అక్కడ భద్రత ఏర్పాట్లు చేయాల్సి ఉండటంతో రేపటి లోపు సీనియారిటీ ఆధారంగా కొత్త డీజీపీని నియమించనున్నారు.