EC:ఏపీలో సంక్షేమ పథకాల నగదు విడుదలపై ఈసీ ఆంక్షలు
- IndiaGlitz, [Thursday,May 09 2024]
ఏపీలో ఎన్నికల వేళ సంక్షేమ పథకాల నిధుల విడుదలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. పోలింగ్ తర్వాతే ఈ పథకాలకు సంబంధించిన డబ్బుల్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసుకోవాలని సూచించింది. ఇప్పటికే బటన్ నొక్కిన పథకాల డబ్బు జమను ఎన్నికలయ్యే వరకు వాయిదా వేసింది. మే 13వ తేదీన పోలింగ్ ముగిసిన తర్వాత డబ్బు జమ చేసేలా మార్గదర్శకాలు జారీ చేస్తామని ఈసీ పేర్కొంది. ఈ మేరకు ఏపీ హైకోర్టుకు ఎన్నికల సంఘం సమాచారం ఇచ్చింది.
కాగా వివిధ పథకాలకు సంబంధించిన డబ్బుల్ని లబ్ధిదారుల అకౌంట్‌లలోకి విడుదల చేసేందుకు ప్రభుత్వం ఈసీ అనుమతి కోరింది. వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఈబీసీ నేస్తం, ఆసరా, జగనన్న విద్యా దీవెన, రైతు పెట్టుబడి సాయం ఇలా పలు పథకాలకు సంబంధించి నిధుల విడుదల గురించి విజ్ఞప్తి చేసింది. అయితే నిధుల విడుదలకు ఈసీ బ్రేక్ వేయడంతో పలువురు పథకాల లబ్ధిదారులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిగింది.
ప్రస్తుతం నిధులు విడుదల చేయాలనుకుంటున్న పథకాలన్నీ ఆన్ గోయింగ్ అని.. నిధులు జమ చేయకుండా నిలిపివేయడం సరికాదని ప్రభుత్వం తరఫున లాయర్ వాదనలు వినిపించారు. ఒకవేళ నిధుల్ని ఇప్పుడు విడుదల చేయకపోతే మే నెల చివరికి మురిగిపోతాయని కోర్టుకు తెలిపారు. మే నెలాఖరుకు ఇంకా సమయం ఉంది కదా అని హైకోర్టు ప్రశ్నించింది. ఈ క్రమంలో తాము పథకాలకు సంబంధించిన నిధులు విడుదల నిలిపివేయమని చెప్పలేదని ఎన్నికల సంఘం తరఫు లాయర్ వాదించారు.
పోలింగ్ ముగిసే వరకు మాత్రమే వాయిదా వేయమనట్లు కోర్టుకు తెలియజేశారు. పోలింగ్ వేళ పథకాలకు సంబంధించిన నిధుల్ని అత్యవసరంగా విడుదల చేయాల్సిన అవసరం ఏంటని తాము వివరణ కోరామన్నారు. దీంతో విచారణను ఇవాళ్టికి వాయిదా వేయగా.. ఎన్నికల సంఘం తన నిర్ణయాన్ని కోర్టుకు తెలియజేసింది. మే 13న పోలింగ్ పూర్తైన తర్వాత ఖాతాల్లో జమ చేసుకోవచ్చని తెలిపింది.