కొడాలి నానిపై కేసు నమోదు చేయండి: ఎస్ఈసీ ఆదేశం
- IndiaGlitz, [Saturday,February 13 2021]
మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు చేయాలని, కృష్ణా జిల్లా ఎస్పీకి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినందుకు ఐపీసీ 504, 505(1)(C), 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని ఆదేశాల్లో ఎస్ఈసీ పేర్కొంది. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినందుకు క్లాజ్-1, క్లాజ్-4 కింద కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఎన్నికల కమిషన్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో చర్యలు తీసుకోవాలని ఎస్పీని ఎస్ఈసీ ఆదేశించింది.
శుక్రవారం ఉదయం తాడేపల్లిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కొడాలి నాని మాట్లాడుతూ.. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి నిమ్మగడ్డ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. జగన్నాథ రథ చక్రాల కింద పడి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నలిగిపోతారని కొడాలి నాని వ్యాఖ్యానించారు. మీడియాలో ప్రసారమైన నాని వ్యాఖ్యలను పరిశీలించిన నిమ్మగడ్డ సీరియస్ అయ్యారు. కొడాలి నాని వివరణ కోరుతూ షో కాజ్ నోటీసు జారీ చేశారు.
అయితే అదే రోజు సాయంత్రానికి కొడాలి నాని తన వివరణను న్యాయవాది ద్వారా పంపించారు. ఆ వివరణలో.. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుదారుల విజయంపైనే మాట్లాడానని తెలిపారు. ప్రతిపక్షాల వేధింపులను ప్రస్తావించానని.. ఎస్ఈసీని కించపరిచే ఉద్దేశం, ఆలోచన తనకు లేవని పేర్కొన్నారు. రాజ్యాంగ వ్యవస్థల పట్ల తనకు గౌరవముందన్నారు. వివరణ పరిశీలించి షోకాజ్ నోటీస్ ఉపసంహరించుకోవాలని కొడాలి నాని కోరారు. అయితే ఈ వివరణపై ఎస్ఈసీ సంతృప్తి చెందలేదు. పైగా ప్రెస్మీట్లో చేసిన ఆరోపణలు, విమర్శలను ఆయన వెనక్కి తీసుకోకపోవడాన్ని తీవ్రంగా పరిగణించింది. దీంతో కొడాలి నానిపై కేసు నమోదు చేయాలని ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది.