Tirupathi: తిరుపతి దొంగ ఓట్ల వ్యవహారంలో పోలీసులపై ఈసీ వేటు
Send us your feedback to audioarticles@vaarta.com
తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక సమయంలో దొంగ ఓట్ల వ్యవహారంలో రోజుకో కీలక పరిణామం చోటుచేసుకుంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌గా దీనిపై దృష్టి పెట్టి అధికారులపై వేటు వేస్తోంది. తాజాగా ఈ వ్యవహారంలో సంబంధం ఉందని భావించిన పోలీసులపై చర్యలకు ఉపక్రమించింది. తిరుపతి తూర్పు పోలీసుస్టేషన్ పరిధిలో నమోదైన దొంగ ఓట్ల కేసును నీరుగార్చినందుకు సీఐ బి.వి.శివప్రసాద్‌రెడ్డి, ఎస్సై జయస్వాములు, హెడ్‌కానిస్టేబుల్ కె.ద్వారకానాథ్‌రెడ్డిపై వేటు పడింది.
అలాగే తిరుపతి పశ్చిమ పోలీసుస్టేషన్లో నమోదైన కేసుల దర్యాప్తును పక్కదారి పట్టించినందుకు ఇన్స్పెక్టర్ శివప్రసాద్ సస్పెండయ్యారు. మరోవైపు అలిపిరి పోలీసుస్టేషన్లో నమోదైన కేసుల దర్యాప్తులో నిర్లక్ష్యం వహించినందుకు అక్కడ సీఐలుగా పనిచేసిన అబ్బన్న, దేవేంద్రకుమార్‌లను వీఆర్‌కు పంపించారు. ఈ మేరకు అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. దొంగ ఓట్ల వ్యవహారంలో ఏకంగా ఇంత మంది పోలీసులపై వేటు పడటం సంచలనంగా మారింది.
అంతకుముందు అన్నమయ్య జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన గిరీషాను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. తిరుపతి ఎంపీ ఉపఎన్నికల సమయంలో ఆయన నగర మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా ఉన్నారు. ఇక ఆ సమయంలో విధులు నిర్వర్తించిన తిరుపతి మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర రెడ్డిని సస్పెండ్ చేసింది. ఓటరు కార్డుల డౌన్ లోడ్ స్కాంతో పాటు తనకు తానే లోక్‌సభ ఉపఎన్నికల్లో ఈఆర్వోగా చంద్రమౌళీశ్వ రెడ్డి వ్యవహరించినట్లు కేంద్ర ఎన్నికల అధికారులు గుర్తించారు. దీంతో ఆయన తీరును క్రిమినల్ నేరంగా పరిగణించి పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు.
కాగా 2021 ఏప్రిల్ 17న జరిగిన తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక అక్రమాలను కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకుంది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మరికొంత మంది అధికారులపైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు అధికారులతో పాటు దొంగ ఓట్ల వేయించడంలో కీలక పాత్ర వహించిన వైసీపీ కీలక నాయకులపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout