Rythu Bharosa: తెలంగాణలో రైతు భరోసా నిధుల పంపిణీకి ఈసీ బ్రేక్
- IndiaGlitz, [Wednesday,May 08 2024]
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. రైతు భరోసా(Rythu Bharosa) నిధుల పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాతే నిధులు విడుదల చేయాలంటూ ఆదేశించింది. ఇటీవల రైతు భరోసా నిధుల విడుదలకు ఈసీ అనుమతి ఇచ్చింది. దీంతో ప్రభుత్వం వెంటనే నిధుల్ని రైతుల ఖాతాలో జమ చేయడం ప్రారంభించింది. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈనెల 9వ తేదీ లోపు రైతు భరోసా నిధులు జమ చేస్తామని ప్రకటించారు.
దీంతో రేవంత్ రెడ్డి ప్రకటన పూర్తిగా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించేలా ఉందని బీఆర్ఎస్ నేత వేణుకుమార్ అనే వ్యక్తి ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన ఈసీ.. కోడ్ ఉల్లంఘించినట్లుగా నిర్ధారించింది. దీంతో వెంటనే రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేయడం నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. పోలింగ్ ముగిసిన తర్వాతే నిధులు విడుదల చేయాలని తాజాగా పేర్కొంది. దీంతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది.
గతంలో ఐదెకరాలలోపు రైతులకే నిధులు విడుదల చేశారు. అయితే ఈసీ అనుమతితో ఐదెకరాలకు పైగా ఉన్న రైతులందరి ఖాతాల్లో డబ్బులు సోమవారం జమచేశారు. ఇప్పటివరకు ఐదెకరాలకు పైగా వ్యవసాయ భూమి కలిగిన రైతుల ఖాతాల్లో రూ.2,423 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. తాజాగా ఈసీ ఆదేశాలతో మిగిలిన రైతుల ఖాతాల్లో పోలింగ్ తర్వాత జమ చేయనున్నారు.
కాగా అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ రైతుబంధు అంశం కీలకంగా మారింది. పోలింగ్ ముందు నిధులు జమ చేయడానికి ఈసీ అవకాశం ఇచ్చింది. అయితే అప్పటి మంత్రి హరీష్ రావు.. ఎన్నికల ప్రచారంలో నిధుల విడుదల గురించి వ్యాఖ్యలు చేశారు. దీంతో ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు పరిగణించిన ఈసీ.. నిధుల విడుదల ఆపేయాలని ఆదేశాలు ఇచ్చింది.