Kaushik Reddy:కౌశిక్‌రెడ్డి శవయాత్ర వ్యాఖ్యలపై ఈసీ తీవ్ర ఆగ్రహం.. విచారణకు ఆదేశం..
- IndiaGlitz, [Wednesday,November 29 2023]
తనను గెలిపిస్తే విజయయాత్రకు వస్తానని, లేదంటే తన శవయాత్రకు రావాలంటూ హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం మండిపడింది. తక్షణమే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని హుజూరాబాద్ ఎన్నికల అధికారిని ఆదేశించింది.
చివరిరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా కౌశిక్‌రెడ్డి తన భార్య, కుమార్తెతో కలిసి హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను గెలిపించకుంటే కుటుంబమంతా కలిసి కమలాపూర్ బస్టాండ్‌లో ఉరేసుకుంటామని హెచ్చరించారు. ఓటేసి దీవిస్తే జైత్రయాత్రకు వస్తానని.. లేదంటే 4న తన శవయాత్రకు రావాలని ఎమోషన్ బ్లాక్మెయిల్ చేశారు. సోషల్ మీడియాలో కూడా కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు వైరల్ కావడంతో ఈసీ స్పందించింది.
ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న కౌశిక్ రెడ్డి హుజురాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. తన భార్యాబిడ్డతో కలిసి జోరుగా ప్రచారం నిర్వహించారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్ నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభలో ఆయన కూతురు శ్రీనిక చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున మాజీ మంత్రి ఈటల రాజేందర్ పోటీ చేస్తుండడంతో కౌశిక్ రెడ్డి గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు. చివరికి ఓటర్లను ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్ చేసే దాకా వచ్చారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఓటర్లను బెదిరిస్తున్నారంటూ ఇతర పార్టీల నాయకులు మండిపడ్డారు.