మోదీ ఎలక్షన్ ప్లాన్ సక్సెస్.. ఈబీసీ బిల్లు పాస్
- IndiaGlitz, [Wednesday,January 09 2019]
ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ముందు వేసిన పాచిక ఫలించింది. అగ్రవర్ణాల్లో పేదలకు పది శాతం రిజర్వేషన్ల పెంచాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం సక్సెస్ అయ్యింది. మంగళవారం రాత్రి ఈబీసీ బిల్లుపై నాలుగున్నర గంటలకు పైగా సుధీర్ఘ చర్చ జరగింది. అనంతరం ఈ బిల్లుపై లోక్‌సభలో ఓటింగ్ జరగ్గా ఇందుకు అనుకూలంగా 323 ఓట్లు రాగా.. వ్యతిరేకంగా 3 ఓట్లు పడ్డాయి. కాగా ఓటింగ్ సమయంలో సభలో మొత్తం 326 మంది ఉన్నారు. ఇప్పటి వరకూ అంతా ఓకే గానీ తదుపరి రాజ్యసభలో బిల్లు పాస్ కావాల్సి ఉంది.
కాగా.. ఈ రిజర్వేషన్లకు తాము ఎలాంటి మద్దతు ప్రకటించమని.. మొదట మేమిచ్చిన డిమాండ్లు నెరవేరుస్తేనే అంగీకరిస్తామన్న తెలుగు రాష్ట్రాలతో అవసరం లేకుండానే లోక్‌సభలో బిల్లు పాసైపోయింది. అయితే ఈ వ్యవహారంపై ఇద్దరు చంద్రులు ఎలా రియాక్టవుతారో చూడాలి. ఇదిలా ఉంటే మన పొరుగు రాష్ట్రంలోని అధికార పార్టీ అయిన అన్నాడీఎంకే సైతం కోటా బిల్లును వ్యతిరేకించింది.
అగ్ర వర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సోమవారం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ కోటాతో విద్య, ఉద్యోగాల్లో వారికి 10 శాతం రిజర్వేషన్లకు పెంచడంతో అది కాస్త 60 శాతానికి చేరనున్నాయి. కాగా.. మాకు కూడా రిజర్వేషన్లు కల్పించి తీరాల్సిందేనంటూ మరాఠాలు, కాపులు, జాట్‌లు తదితర అగ్ర వర్గాలు కొన్నేళ్ల నుంచి ఆందోళనలు చేస్తున్న విషయం విదితమే.