హైదరాబాద్‌లో భూప్రకంపనలు.. ఇళ్ల నుంచి జనం పరుగులు..

  • IndiaGlitz, [Saturday,October 03 2020]

హైదరాబాద్‌లో భూ ప్రకంపనలు కలకలం రేపాయి. బోరబండలో భూమి కంపించింది. రాత్రి 8.45, 11.42 నిమిషాలకు రెండు సార్లు భూమి కంపించింది. 10 నుంచి 15 సెకండ్లపాటు పెద్ద శబ్దాలతో భూమి కంపించింది. బోరబండ, రెహమత్‌నగర్, అల్లాపూర్ ప్రాంతాల్లో భారీ శబ్దాలు చోటు చేసుకున్నాయి. భయంతో ఇళ్ల నుంచి జనం బయటకు పరుగులు తీసింది. 2017లో కూడా ఇలాగే జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు వెల్లడించారు.

మరోవైపు జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో సైతం భూమి కంపించింది. రాత్రి 8:15 గంటల నుంచి 9 గంటల లోపు భూమి 12 సార్లు కంపించింది. భూమిలో నుంచి భారీ శబ్దాలు వెలువడటంతో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రాత్రి 9 తర్వాత ప్రకంపనలు ఆగిన అనంతరం జనం ఇళ్లలోకి వెళ్లారు. భూమి పొరల్లో చీలికలతో ఇలాంటి ప్రకంపనలు తరచూ వస్తుంటాయని ఎన్‌జీఆర్ఐ శాస్త్రవేత్త డాక్టర్ నగేష్ పేర్కొన్నారు. బోరబండ సహా పలు ప్రాంతాల్లో వచ్చిన శబ్దాలు భూకంపమేనన్నారు. 1.4 తీవ్రతతో భూకంపం వచ్చినట్లుగా గుర్తించారు.