Earthquake in Japan: జపాన్‌ను వణికిస్తున్న వరుస భూకంపాలు.. సునామీ హెచ్చరికలు..

  • IndiaGlitz, [Monday,January 01 2024]

కొత్త సంవత్సరం జపాన్‌(Japan)కు భీకరమైన జ్ఞాపకాన్ని తీసుకొచ్చింది. వరుస భూకంపాల(Earthquake)తో ఆ దేశం ఉలిక్కిపడింది. 90 నిమిషాల వ్యవధిలో 21 భూకంపాలు సంభవించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. షికావా, నైగట, టయోమా, నోటో రాష్ట్రాల్లో వరుసగా భూకంపాలు భయపెట్టాయి. నోటోలో స్థానిక కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 4 గంటల 6 నిమిషాలకు 5.7 తీవ్రతతో భూమి కంపించింది. వెంటనే ఇతర ప్రాంతాల్లో వరుసగా 7.6, 6.1, 4.5, 4.6, 4.8 తీవ్రతతో భూమి కంపించింది. వాతావరణశాఖ అధికారులు వెంటనే సునామీ(Tsunami) హెచ్చరికలు జారి చేశారు. ఆ కొంతసేపటికే 1.2మీటర్ల ఎత్తుగల అలలు వజిమ నగరాన్ని ఢీకొట్టాయి.

మరికొన్ని తీర ప్రాంతాల్లో 5 మీటర్ల ఎత్తు ఉండే భయంకరమైన అలలు దూసుకెళ్లాయి. సాధారణంగా 30-40 సెంటీమీటర్ల అలలను తట్టుకోవడమే చాలా కష్టం. అలాంటిది 5 మీటర్ల ఎత్తులో అలలు వస్తే పరిస్థితులు ఎంత ఘోరంగా ఉంటాయో ఊహించడానికే భయంకరంగా ఉంది. వరుస భూకంపాల ధాటికి అనేక భవనాలు కదిలాయి. మెట్రో రైళ్లు, హోర్డింగ్లు, వీధి లైట్లు, బోర్డులు, ఇలా ప్రతి ఒక్కటి షేక్ అయ్యాయి. దీంతో ప్రజలు ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

సునామీ హెచ్చరికలు, భూకంపాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత, ఎత్తైన ప్రాంతాలకు తరలిస్తున్నారు. అటు రష్యా, నార్త్ కొరియా, దక్షిణ కొరియా దేశాలు కూడా అలర్ట్ అయ్యాయి. అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించాయి. అలాగే జపాన్‌లో భూకంపం, సునామీ నేపథ్యంలో అక్కడి భారత రాయబార కార్యాలయం అప్రమత్తమైంది. ముప్పు ప్రాంతాల్లోని భారతీయుల కోసం ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్‌ని విడుదల చేసింది.

సాధారణంగా జపాన్‌లో భూకంపాలు వస్తూ ఉంటాయి. అయితే కొన్నిసార్లు వాటి తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ.. ఒక్కోసారి మాత్రం అధిక తీవ్రతతో సంభవిస్తాయి. దీంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుంది. ఈ క్రమంలోనే 2011వ సంవత్సరంలో మార్చి 11న ఈశాన్య జపాన్‌కు సమీపంలోని సముద్రంలో 9 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. వెంటనే సునామీ దేశంపై విజృంభించింది. ఆ విషాద దుర్ఘటనలో 19వేలకు పైగా ప్రజలు మరణించారు. ఇప్పటికీ ఆ భయంకరమైన ఘటనను తలుచుకుంటే జపాన్ వాసులు వణికిపోతారు.