ఇండోనేషియాలో భారీ భూకంపం.. ఏడుగురి మృతి

  • IndiaGlitz, [Friday,January 15 2021]

ఇండోనేషియాలో భారీ భూకంపం కల్లోలం రేపింది. శుక్రవారం తెల్లవారుజామున సులావేసి దీవుల్లో మజేన్‌ నగర సమీపంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదైంది. ఇప్పటి వరకూ ఏడుగురు మృతి చెందగా.. వందల సంఖ్యలో గాయాలపాలయ్యారు. అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. భవన శిథిలాల కింద అనేక మంది చిక్కుకు పోయినట్టు తెలుస్తోంది. అక్కడి కాలమానం ప్రకారం అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత భూకంపం సంభవించింది. దాదాపు 7 సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో స్థానికులు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు.

భూకంపం తీవ్రతకు 60 భవనాలు కుప్పకూలినట్టు ఇండోనేషియా డిజాస్టర్ మిటిగేషన్ ఏజె న్సీ వెల్లడించింది. గవర్నరు కార్యాలయం కూడా తీవ్రంగా దెబ్బతిన్నదని అధికారులు తెలిపారు. భూకంపం తర్వాత ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. అర్ధరాత్రి భూకంపం సంభవించడంతో ప్రజానీకం గాఢ నిద్రలో ఉండి వెంటనే బయటకు రాలేకపోయినట్టు తెలుస్తోంది. దీంతో శిథిలాల కింద చాలా మంది చిక్కుకున్నట్టు సమాచారం. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. భూకంపం వల్ల విద్యుత్ సరఫరా వ్యవస్థ నిలిచిపోయిందని అధికారులు తెలిపారు. ఈ భూకంపం వల్ల పలు ఇళ్లు, హోటళ్లు, ఆసుపత్రులు నేలమట్టమయ్యాయి.

కాగా.. గురువారం కూడా ఇదే ప్రాంతంలో భూకంపం సంభవించింది. 5.9 తీవ్రతతో గురువారం భూమి కంపించింది. ఒక్కరోజులోనే పలుమార్లు భూకంపం సంభవించడంతో పలు చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. విద్యుత్ సరఫరాకు సైతం తీవ్ర అంతరాయం ఏర్పడింది. 2018లో సులవేసిలో సంభవించిన భూకంపం కారణంగా వచ్చిన సునామీ వల్ల వేలాది మంది మరణించారు.