Dwaraka Review
ఎవడే సుబ్రమణ్యం సినిమాలో చిన్న పాత్రలో నటించినా తన నటనతో అందరినీ ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ చేసిన పెళ్ళిచూపులు సూపర్‌హిట్ కావడంతో విజయ్ దేవరకొండ నెక్ట్స్ సినిమా ఎంటోనని ప్రేక్షకుల్లో ఓ క్యూరియాసిటీ ఏర్పడింది. ఇదే టైంలో విజయ్‌దేవరకొండ నటించిన చిత్రం ద్వారక ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాపై మంచి ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. మరి విజయ్ దేవరకొండ హీరోగా చేసిన రెండో ప్రయత్నం ఎంత వరకు సక్సెస్ అయ్యిందో తెలుసుకుందాం...
కథ:
ఎర్రశీను స్నేహితులతో కలిసి చిన్న చితకా దొంగతనాలు చేస్తుంటాడు. ఓ పెద్ద దొంగతనం చేసి లైఫ్‌లో సెటిలైపోవాలనుకుంటాడు. అందుకోసం ఓ దేవాలయంలో విగ్రహాన్ని దొంగలిస్తుండగా పోలీసులు వచ్చేస్తారు. తప్పించుకునే సమయంలో ద్వారక అనే అపార్ట్‌మెంట్లో శ్రీను దాక్కొంటాడు. శ్రీను చూసిన పృథ్వీకి కోర్టు గొడవలు సమసి పోవడంతో పృథ్వీ ఎర్ర శ్రీను మహాపురుషుడు కృష్ణానందను చేసేస్తాడు. ఎర్ర శ్రీను స్నేహితులు కూడా ఓ ట్రస్ట్ పెట్టి భక్తుల నుండి డబ్బుల వసూలు చేస్తుంటారు. ఎర్ర శ్రీను విషయం తెలిసిన లాయర్ రవి(ప్రభాకర్), అతన్ని బ్లాక్‌మెయిల్ చేస్తూ, కోట్లు సంపాదించుకోవాలనుకుంటాడు. మరోవైపు ఎర్రశ్రీను అదే అపార్ట్‌మెంట్‌లోని వసుధ(పూజా ఝవేరి)ని ప్రేమిస్తాడు. ఇంతకు శ్రీను ప్రేమ సక్సెస్ అయ్యిందా? దొంగ బాబాగా శ్రీను అవతారం చాలిస్తాడా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...
ప్లస్ పాయింట్స్:
- నటీనటులు
- కామెడి
- సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
- స్లో నెరేషన్
- ఎడిటింగ్
‘పెళ్లిచూపులు’ తర్వాత విజయ్ దేవరకొండ రెండో మూవీ ఇది. ఈ మూవీలో కూడా తనదైన నటనతో విజయ్ అందరినీ ఆకట్టుకున్నాడు. దొంగగా, బాబాగా, ప్రేమికుడుగా, సమాజం మంచి కోరే వ్యక్తిగా డిఫరెంట్ యాంగిల్స్‌లో చక్కగా నటించాడు విజయ్ దేవరకొండ. పాత్రకు తగినట్లు నటించి, మరో వైపు వినోదం చేయగలనని నిరూపించుకున్నాడు.. కథనాయిక పూజ జవేరి తన పాత్రకు న్యాయం చేసింది. మెప్పించింది. మురళీ శర్మ తన నటనతో మరోసారి ఆకట్టుకున్నారు. పృథ్వీతో సహా కామెడీ గ్యాంగ్ అంతానవ్వులు పంచింది. ప్రకాశ్‌రాజ్ అతిథిగా నటించి తన మార్క్ ను చూపాడు.దొంగ శీను.. బాబాగా మారే క్రమం.. బాబాగా చేసే విన్యాసాలు.. మూఢ భక్తి.. మీడియా చేసే హంగామా తదితర సన్నివేశాలను దర్శకుడు శ్రీనివాస్ రవీంద్ర బాగానే డీల్ చేశాడు. బాబా గుట్టురట్టు చేయడానికి వచ్చిన మురళీశర్మ కు కథానాయకుడు దొరికిపోతాడా.. లేదా? అనే ఆసక్తిని ప్రేక్షకులకు కలిగించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఇలాంటి కథతో ఇది వరకు తెలుగులో సినిమా వచ్చింది. అయితే సినిమాను నడిపించిన విధానం మెప్పిస్తుంది. సాయికార్తీక్ అందించిన పాటల్లో రెండు పాటలు బావున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బావుంది. శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రఫీ బావుంది. నిర్మాణ విలువలు బావున్నాయి.
బోటమ్ లైన్: ద్వారక... పాత కథ.. కొత్త కలరింగ్
Dwaraka English Version Review
- Read in English