Duvvada Srinivas:తనపై భార్య పోటీకి దిగడంపై స్పందించిన దువ్వాడ శ్రీనివాస్
- IndiaGlitz, [Saturday,April 20 2024]
ఏపీలో పోలింగ్ దగ్గర పడుతున్న వేళ రాజకీయ వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. ప్రచారంలో భాగంగా నేతలు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. అయితే శ్రీకాకుళం జిల్లా రాజకీయం మాత్రం మరింత ఆసక్తికరంగా మారింది. టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ తరఫున దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas) పోటీ చేస్తున్నారు. ఇదే సమయంలో ఆయన భార్య దువ్వాడ వాణి (Duvvada Vani) సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుతం జడ్పీటీసీ సభ్యురాలిగా ఉన్న ఆమె టెక్కలి నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో నిలుస్తానని ప్రకటించారు. ఈ నెల 22న నామినేషన్ వేయబోతున్నట్లు చెప్పడం తీవ్ర చర్చనీయాంశమైంది.
తాజాగా దువ్వాడ వాణి ప్రకటనపై ఆమె భర్త దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు. వాణి నా భార్య.. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా నామినేషన్ వేసే, పోటీ చేసే అధికారం, హక్కు ఉంది. కాదని చెప్పే అర్హత ఎవరికీ లేదు. ఏం చేస్తాం. కలియుగ ప్రభావం. సొంత అన్నదమ్ములు, కుటుంబం తిరగబడవచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. అయితే, ఆమె నామినేషన్ వేయరనే నేను అనుకుంటున్నాను. నేను రాత్రికి రాత్రే రెడీమేడ్‌గా తయారైన నాయకుడిని కాదు. నాది పాతికేళ్ల రాజకీయ జీవితం అని స్పష్టం చేశారు.
టెక్కలి నియోజకవర్గాన్ని వైసీపీ అన్ని విధాలుగా అభివృద్ధి చేసిందని.. టీడీపీ నాయకులు ఇక్కడ ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని నిలదీశారు. ఐదేళ్ల కాలంలో సీఎం జగన్ ఇంటింటికీ సంక్షేమం అందించడం సహా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారన్నారు. ఈసారి టెక్కలిలో 25 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడి నుంచి టీడీపీ తరపున రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, కాంగ్రెస్ తరపున మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి పోటీ చేస్తున్నారు. దీంతో ఈ నియోజకవర్గం ఎన్నికల ఆసక్తికరంగా మారింది.
కాగా దువ్వాడ వాణిని గతేడాది మే నెలలో టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్తగా సీఎం జగన్ నియమించారు. అయితే అభ్యర్థులను ప్రకటించే సమయంలో దువ్వాడ వాణికి బదులు ఆమె భర్త శ్రీనివాస్‌కు టికెట్ కేటాయించారు. దీంతో వాణి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీనివాస్ గెలుపునకు సహకరించాలని ప్రచారంలో పాల్గొనాలని పార్టీ పెద్దలు సూచించినా ఆమె అంగీకరించలేదు. మరోవైపు దువ్వాడ శ్రీనివాస్ సోదరుడు శ్రీకాంత్ కూడా ఇటీవల టీడీపీలో చేరడం కలకలం రేపింది. తాజాగా ఆయన భార్య వాణి కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని భావించడంతో శ్రీనివాస్ గెలుపు కష్టంగా మారుతుందన్న చర్చ కూడా నడుస్తోంది.