Download App

Duvvada Jagannadham Review

క‌మ‌ర్షియ‌ల్ హీరోగా ఎదుగుతున్న క్ర‌మంలో అల్లుఅర్జున్ స‌రికొత్త క‌థాంశాల‌తో ముందుకెళ్తున్నాడు. బ‌న్నికి హీరోగా బ్రేక్ ఇచ్చిన సినిమా ఆర్య‌, అలాగే హీరోగా మంచి పేరు తీసుకొచ్చిన సినిమా పరుగు. ఈ రెండు చిత్రాల‌ను నిర్మాత దిల్ రాజు నిర్మించాడు. దాదాపు తొమ్మిదేళ్ళ త‌ర్వాత వీరి కాంబినేష‌న్‌లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ `డీజే దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌`. గ‌బ్బ‌ర్ సింగ్ వంటి హిట్ త‌ర్వాత హ‌రీష్ శంక‌ర్ రామ‌య్యావ‌స్తావ‌య్యా ప్లాప్ తీశాడు. దాంతో పెద్ద హీరోలు అవ‌కాశం రాలేదు. అయితే అప్‌క‌మింగ్ మెగా ఫ్యామిలీ హీరోతో సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ సినిమా తీసి మంచి విజ‌యాన్ని ద‌క్కించుకున్న హ‌రీష్‌కు దిల్‌రాజు బ‌న్నితో సినిమా అవ‌కాశం క‌ల్పించాడు. మ‌రో విష‌యమేమంటే నిర్మాతగా దిల్‌రాజు నిర్మించిన 25వ చిత్రం కూడా ఇదే కావ‌డం విశేషం. మ‌రి ఈ సినిమా బ‌న్ని, దిల్‌రాజుల‌కు`డీజే దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌` హ్యాట్రిక్ హిట్ మూవీగా నిలుస్తుందా లేదా అని తెలియాలంటే సినిమా క‌థలోకి వెళ‌దాం....

క‌థ:

క‌థ‌లో హీరో జ‌గ‌న్నాథమ్ ఓ బ్రాహ్మ‌ణ యువ‌కుడు. చిన్న‌ప్పుడు ఓసారి అన్యాయం జరుగుతుంటే పోలీస్ గ‌న్‌తో ఎన్‌కౌంట‌ర్ చేసేస్తాడు. స్టేష‌న్‌లోని ఓ పోలీస్‌(ముర‌ళీశ‌ర్మ‌) జ‌గ‌న్నాథ‌మ్‌కు స‌పోర్ట్‌గా నిలుస్తాడు. పెరిగి పెద్ద‌యిన జ‌గ‌న్నాథ‌మ్ విజ‌య‌వాడ‌లోని అగ్ర‌హారంలో వంట‌వాడిగా ఉంటూ అన్న‌పూర్ణ క్యాట‌రింగ్‌ను న‌డుపుతుంటాడు. ముర‌ళీశ‌ర్మ నుండి ఫోన్ వ‌చ్చిన ప్ర‌తిసారి డీజేగా మారి అన్యాయం చేసిన వారిని చంపేస్తుంటాడు. కానీ ఈ విష‌యం బ‌య‌ట ఎవ‌రికీ తెలియ‌దు. త‌ప్పు చేసిన వారు మాత్రం డీజే పేరు వింటే భ‌య‌ప‌డుతుంటారు. త‌న స్నేహితుడు విఘ్నేశ్వ‌ర‌శాస్త్రి( వెన్నెల కిషోర్‌) పెళ్ళిలో ఫ్యాష‌న్ డిజైనింగ్ చ‌దివిన పూజ‌(పూజా హెగ్డే)ను చూసి ప్రేమ‌లో ప‌డ‌తాడు. హోం మినిష్ట‌ర్(పోసాని కృష్ణ‌ముర‌ళి) కూతురైన పూజ ముందు జ‌గ‌న్నాథ‌మ్ ప్రేమ‌ను తిర‌స్క‌రించినా త‌ర్వా ప్రేమిస్తుంది. క‌థ ఇలా సాగుతుండ‌గా హైద‌రాబాద్‌లో రియ‌ల్ ఎస్టేట్ స‌హా ప‌లు వ్యాపారాలు బినామీ స్టీఫెన్ ప్ర‌కాష్‌(శ‌త్రు) పేరుతో చేసే రొయ్య‌ల‌నాయుడు(రావు ర‌మేష్‌) అగ్రో డైమండ్ అనే రియ‌ల్ ఎస్టేట్ కంపెనీ పేరుతో ప్ర‌జ‌లను మోసం చేస్తాడు. ప్ర‌జ‌లు ద‌గ్గ‌ర దోచుకున్న తొమ్మిది వేల కోట్ల రూపాయ‌ల‌ను అబుదాబిలోని త‌న కొడుకు ద‌గ్గ‌ర‌కు పంపేస్తాడు. కానీ స్టీఫెన్ ప్ర‌కాష్ వెనుక రొయ్య‌ల నాయుడు అనే వ్య‌క్తి ఉన్నాడ‌నే సంగ‌తి బ‌య‌ట ప్ర‌పంచానికి తెలియ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతుంటాడు. అగ్రో డైమండ్ చేసిన మోసం కార‌ణంగా జ‌గ‌న్నాథ‌మ్ మావ‌య్య(చంద్ర‌మోహ‌న్‌) ఆత్మ‌హ‌త్య చేసుకుంటాడు. దాంతో కోపం వ‌చ్చిన జ‌గ‌న్నాథ‌మ్ అస‌లు అగ్రో డైమండ్ మోసం వెనుక ఎవ‌రున్నార‌నే విష‌యాలు ఆరా తీసి స్టీఫెన్ ప్ర‌కాష్‌ను బంధిస్తాడు. మ‌రోవైపు రొయ్య‌ల‌నాయుడు పోలీసులు, సిబిఐ నుండి త‌ప్పించుకోవ‌డానికి త‌న కొడుకుతో హోం మినిష్ట‌ర్ కూతురు పూజ‌కు పెళ్ళి చేయాల‌నుకుంటాడు. కానీ పూజ, జగన్నాథమ్‌ను ప్రేమిస్తుంద‌ని తెలుసుకుని జ‌గ‌న్నాథ‌మ్‌ను చంపేయాల‌నుకుంటాడు. అక్కడ నుండి కథ మలుపు తిరుగుతుంది. అసలు రొయ్యల నాయుడు గురించి జగన్నాథమ్‌కు తెలుస్తుందా ? జ‌గ‌న్నాథ‌మ్‌, డీజే ఒక‌డేన‌ని రొయ్య‌ల‌నాయుడుకి తెలుస్తుందా?  చివ‌ర‌కు ఏం జ‌రిగింద‌నే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...

ప్ల‌స్ పాయింట్స్:

ఇందులో ముందుగా చెప్పుకోవాలంటే బ‌న్ని గురించి చెప్పాలి. డీజేగా, బ్రాహ్మ‌ణ యువ‌కుడు అనే రెండు షేడ్స్‌లో అల్లు అర్జున్ చ‌క్క‌టి తేడాను క‌న‌ప‌రిచాడు. డీజే పాత్ర‌లో ఎంత స్ట‌యిలిష్‌గా క‌న‌ప‌డ్డాడో, జ‌గ‌న్నాథ‌మ్ అనే బ్రాహ్మ‌ణ యువ‌కుడి పాత్ర‌లో పంచెక‌ట్టులో అలాగే క‌న‌ప‌డ్డాడు. బ్రాహ్మ‌ణులు మాట్లాడేలా బ‌న్ని చ‌క్క‌గా మాట్లాడాడు. భాష ఉచ్ఛ‌ర‌ణ కూడా చ‌క్క‌గా ఉంది. ఫైట్స్‌లు, డ్యాన్సులు ఇర‌గ‌దీశాడు. మెచ్చుకో మెచ్చుకో పిల్లో...అనే సాంగ్‌లో చిరంజీవి ముఠామేస్త్రీ స్టెప్‌ను వేసి మెగాభిమానులను ట‌చ్ చేశాడు. అలాగే విజిలేస్తా..అనే సాంగ్ ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, మెగాస్టార్ అంటూ అంద‌రికీ ద‌గ్గ‌ర‌య్యే ప్ర‌య‌త్నం చేశాడు. ముర‌ళీ శ‌ర్మ బ‌న్నికి ఫోన్ చేస్తున్న‌ప్పుడు ఫోన్‌లో సీరియ‌స్‌గానే మాట్లాడుతున్నా, ఇంట్లోవారికి అనుమానం రాకుండా కామెడిని ఎక్స్‌ప్రెష‌న్స్‌తో చ‌క్క‌గా చేశాడు. అలాగే వేదాలు చెప్పే స‌న్నివేశం ఇలా బ‌న్ని మార్కు క‌న‌ప‌డుతుంది. పూజా హెగ్డే న‌ట‌న అంటే ప్ర‌త్యేకంగా చెప్ప‌లేం కానీ అందాల‌ను కావాల్సినంత‌గానే ఆర‌బోసింది. ముఖ్యంగా స్విమ్ సూట్‌లో క‌న‌డే స‌న్నివేశం, నాభి అందాలు చూపించే స‌న్నివేశాలు బాగానే ఉన్నాయి. యూత్‌ను ఆకట్టుకుంటాయి. డ్యాన్సులు  విషయంలో కూడా పూజా హెగ్డే బాగానే క‌ష్ట‌ప‌డింది. అస్మైక యోగ‌, త‌స్మైక భోగ స‌హా ప్ర‌తి పాట‌లో చ‌క్క‌గా డ్యాన్స్ చేసింది. ఇక త‌నికెళ్ళ‌భ‌ర‌ణి, పోసాని కృష్ణ‌ముర‌ళి, సుబ్బ‌రాజు, ముర‌ళీశ‌ర్మ‌, శ్ర‌వ‌ణ్‌, శ‌శాంక్‌, వెన్నెల‌కిషోర్‌, చంద్ర‌మోహ‌న్ స‌హా అంద‌రూ వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పాత్ర రావు ర‌మేష్‌. మెయిన్ విల‌న్ రొయ్య‌ల నాయుడుగా రావు గోపాల‌రావును త‌ల‌పించేలా చ‌క్క‌గా న‌టించాడు.

సినిమాకు దేవిశ్రీ మ్యూజిక్ మ‌రో బ‌ల‌మైన అంశం. టైటిల్ సాంగ్ `శ‌రణం భ‌జే..`, .`తస్మైక యోగ ర‌స్మ‌క భోగ‌...`, విజిలేస్తా...`. బాక్సు బ‌ద్ద‌లైపోద్ది...` స‌హా ప్ర‌తి పాట ఊపుగా ఉంది. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చ‌క్క‌గా ఉంది. అందుకు త‌గిన విధంగా మంచి సాహిత్యం కుదిరింది.

ఐనాక‌బోస్ సినిమాటోగ్ర‌ఫీ బావుంది. ప్ర‌తి సీన్‌లో రిచ్ నెస్ క‌న‌ప‌డింది. అలాగే పాట‌ల పిక్చ‌రైజేష‌న్ చేసిన విధానం మెచ్చుకోలుగా ఉంది. ఇక డైలాగ్స్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటాయి. విజ‌య‌వాడ‌లో పైన అమ్మవారు, ఇంట‌ర్ క్యాస్ట్ మ్యారేజెస్ గురించి హీరో మాట్లాడే సంద‌ర్భంలో క్రింద క‌మ్మ‌వారు అనే క్యాస్ట్‌ను సూచించే డైలాగ్ చెప్పించిన ద‌ర్శ‌కుడు దీన్ని కాంట్ర‌వ‌ర్సీ చేయ‌వ‌ద్ద‌ని కూడా చెప్పించ‌డం ముందు చూపుత‌నాన్ని తెలియ‌జేస్తుంది.

ప‌బ్బులో వాయించే డీజేను కాను..ప‌గిలిపోయేలా వాయించే డీజేను అని ద‌ర్శ‌కుడు హీరో క్యారెక్ట‌రైజేష‌న్‌ను సింపుల్‌గా ఒక లైన్‌లో చెప్పేశాడు. అలాగే విల‌న్స్‌తో మాట్లాడే సంద‌ర్భంలో గ‌మ్మునుండ‌వ‌య్యా అంటూ రుద్ర‌మ‌దేవిలో గోన‌గ‌న్నారెడ్డి డైలాగ్‌ను చెబుతూనే తెలంగాణ యాస‌లో సంభాష‌ణ చెప్పే తీరు  ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుంది.

కావాల్సిన వారి క‌ళ్లు చూస్తే వారికేం కావాలో తెలిసిపోతుంది. అడుగ‌క్క‌ర్లేదు అని బ‌న్ని, చంద్ర‌మోహ‌న్‌తో చెప్పే డైలాగ్‌, బ‌న్ని, పూజా హెగ్డే ల‌వ్ ప్ర‌పోజ‌ల్ పెట్టిన‌ప్పుడు ముందు పూజా హెగ్డే తిర‌స్క‌రిస్తుంది. అప్పుడు అమ్మాయికి అబ్బాయికి మ‌ధ్య రిలేష‌న్ గ్యాస్ స్ట‌వ్‌, లైట‌ర్‌లా ఉండాలి కానీ అగ్గిపుల్ల‌, నీళ్ళ‌లా ఉండ‌కూడ‌దంటూ చెప్ప‌డం, ప‌క్క‌నున్న‌వాడు ఎమ్మెస్‌ను గుర్తు చేసేలా యాక్ట్ చేయ‌డం ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంది. చంద్ర‌మోహ‌న్ ఆత్మ‌హ‌త్య‌కు ఓ రియ‌ల్ ఎస్టేట్ సంస్థ చేసిన మోసం అని తెలుసుకున్న బ‌న్ని మ‌ధ్య త‌ర‌గ‌తి వారు బావుండాలని స్కీమ్స్‌లో చేరి స్కామ్ రూపంలో బ‌య‌ట‌కు వ‌స్తారు అని ఇవాళ బుద్ధం శ‌ర‌ణం గ‌చ్ఛామి కాదు..యుద్ధం శ‌ర‌ణం గ‌చ్చామి అనాలి అంటూ బ‌న్ని చెప్పే డైలాగ్స్ స‌న్నివేశాల‌క‌నుగుణంగా మెప్పిస్తాయి.

మైన‌స్ పాయింట్స్:

ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ ఏదో కొత్త పాయింట్‌ను ఈ సినిమాలో చెప్ప‌లేదు. అంద‌రికీ తెలిసిన క‌థ‌ను ఎంట‌ర్‌టైనింగ్‌లోనే చెప్పేశాడు. అస‌లు హీరో ఏంటి, అస‌లు క‌థ ఎలా సాగ‌నుందో అనే విషయం సినిమా ప్రారంభ‌మైన ప‌ది నిమిషాల‌కే తెలిసిపోతుంది. కాబ‌ట్టి క‌థ‌లో కొత్త‌ద‌నం వెతికినా క‌న‌ప‌డ‌దు. స‌న్నివేశాల‌ను ప్రేక్ష‌కులు ముందుగానే ఊహించేస్తారు. ఫస్టాఫ్ ఎంట‌ర్‌టైనింగ్‌గా, ల‌వ్ ట్రాక్‌తో సాగినా సెకండాఫ్ అంతా రివేంజ్ డ్రామాలా సాగుతుంది. విల‌న్‌కు, హీరో క్యారెక్ట‌రైజేష‌న్స్‌ను బ‌లంగా ఎలివేట్ చేసిన ద‌ర్శ‌కుడు వారిద్ద‌రూ క‌లుసుకునే స‌న్నివేశాల‌ను పేల‌వంగా డిజైన్ చేసుకున్నాడు. బ‌న్ని సినిమాలో వీక్ క్లైమాక్స్ ఇదేన‌నిపించింది.

విశ్లేష‌ణ:

బ‌న్ని, హ‌రీష్ క‌లిసి చేసిన మూడో ప్ర‌య‌త్నంలో కొత్త క‌థ‌, ఏదో చేసేయాల‌నే ఉద్దేశంతో కాకుండా క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర‌టైన‌ను చేశారు. ఓ ర‌కంగా చూస్తే దిల్‌రాజు ఆర్య‌, ప‌రుగు చిత్రాలు క‌థ ప‌రంగా, హీరో క్యార‌క్ట‌రైజేష‌న్ ప‌రంగా బ‌న్నికి కొత్త‌దనాన్ని ఆపాదించాయి. కానీ డీజే దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కింది. హరీష్ సంభాష‌ణ‌లను స‌న్నివేశాల‌కు త‌గిన విధంగా బ‌లంగానే రాశాడు కాబ‌ట్టి కామ‌న్ ఆడియెన్స్ సినిమాకు బాగా క‌నెక్ట్ అవుతారు. బ‌న్ని ఎన‌ర్జిటిక్ పెర్‌ఫార్మెన్స్‌కు దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం, ఐనాక బోస్ సినిమాటోగ్ర‌ఫీ తోడు కావ‌డంతో సినిమా ఎంట‌ర్‌టైనింగ్‌గా సాగుతుంది. సినిమా ఎక్క‌డా బోర్ కొట్టించ‌దు. ఎంట‌ర్‌టైన్‌మెంట్ కావాలి. రెండున్న‌ర గంట‌ల పాటు స‌రాదాగా న‌వ్వుకోవాల‌నుకునే ప్రేక్ష‌కుడు త‌ప్ప‌కుండా చూసే సినిమా ఇది.

బోటమ్ లైన్: క‌థ‌లో కొత్త‌ద‌నం లేక‌పోయినా.. డీజే దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ ఎంట‌ర్‌టైన్ చేస్తాడు.

Duvvada Jagannadham English Version Review

Rating : 2.8 / 5.0