బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం జరిగింది: సీఎం రేవంత్ రెడ్డి
Send us your feedback to audioarticles@vaarta.com
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ నేతలను కాపాడుకోవడానికి పొలం బాట పట్టి డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. చనిపోయిన రైతుల వివరాలు ఇచ్చేందుకు కేసీఆర్కు 48 గంటల సమయం ఇస్తున్నానని.. పూర్తి వివరాలు ఇస్తే ఎన్నికల కోడ్ ముగియగానే వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. పంటలు ఎండిపోక ముందే ఆ విషయం తమకు చెప్పొచ్చు కదా ఎండిపోయిన తరువాత మంటల దగ్గర కేసీఆర్ చలి కాచుకుందాం అనుకుంటున్నారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ పదేళ్ల హయాంలో వందేళ్ల విధ్వంసం జరిగిందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కనీసం రైతుల ముఖం చూడని కేసీఆర్.. 10 సంవత్సరాల తర్వాత అయినా పొలం బాట పట్టినందుకు సంతోషంగా ఉందన్నారు. అధికారం కోల్పోయినందుకు, కూతురు జైలుకు పోయినందుకు కేసీఆర్ను చూస్తే జాలి కలుగుతోందన్నారు. కేసీఆర్ పాపాలకే ఈ కరువు అని.. కేసీఆర్ పాపాలు కాంగ్రెస్ ఖాతాలో వేయడానికి ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు వేయడానికి 10 నెలల సమయం తీసుకుందని.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లోనే 65 లక్షల రైతుల ఖాతాలో రైతు బంధు వేసిందని తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో అన్ని బొక్కలే ఉన్నాయని ఇక నీళ్లు ఎత్తిపోయడం ఎలా సాధ్యమని బీఆర్ఎస్ నేతలని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో రూ.1500 కోట్లు ఉన్నాయి కదా.. రైతులకు ఓ రూ.100 కోట్లు సహాయం చేయవచ్చు కదా అని సూచించారు. సోనియా గాంధీ ప్రకటించిన 6 గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నామని.. ఎన్నికల కోడ్ తర్వాత మిగతా హామీలను అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామని వెల్లడించారు.
లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈనెల 6 తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించనుందని.. ఆ సభలోనే ఏఐసీసీ మ్యానిఫెస్టో విడుదల చేస్తామని తెలిపారు. ఈ సభకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సభకు హాజరవుతారని చెప్పారు. అంతకుముందు సభాస్థలి వద్ద జరుగుతున్న ఏర్పాట్లను రేవంత్ పరిశీలించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments