రణరంగంలా మారిన దుబ్బాక..
- IndiaGlitz, [Tuesday,October 27 2020]
దుబ్బాక ఉపఎన్నిక రాజకీయంగా హీట్ పుట్టిస్తోంది. దుబ్బాక ఎన్నికను పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని పార్టీల ముఖ్య నేతలంతా సిద్దిపేటకు చేరుకోవడంతో రణరంగాన్ని తలపిస్తోంది. కాగా.. సోమవారం సిద్ధిపేట సోదాలు.. అరెస్టులు.. లాఠీచార్జిలతో అట్టుడికింది. దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు బంధువుల ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
సోమవారం మధ్యాహ్నం పోలీసులు.. రెవెన్యూ అధికారులతో కలిసి రఘునందన్‌రావు బంధువులు సురభి రాంగోపాల్‌రావు, సురభి అంజన్‌రావు ఇళ్లలో తనిఖీలు చేశారు. అయతే రాంగోపాలరావు ఇంట్లో ఎలాంటి నగదు లభ్యం కాకపోగా.. అంజన్‌రావు ఇంట్లో మాత్రం రూ.18.67 లక్షలు లభ్యమైనట్టు పోలీసులు ప్రకటించారు. అయితే వాటిని పోలీసులే అంజన్‌రావు ఇంట్లో పెట్టారంటూ ఆందోళనకు దిగారు. మరోవైపు రఘునందన్‌రావు అక్కడికి చేరుకుని.. నోటీసులివ్వకుండా ఎలా తనిఖీ చేస్తారంటూ ఫైర్ అయ్యారు.
పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. దీంతో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే పోలీసులు బీజేపీ కార్యకర్తలపై లాఠీ చార్జి చేశారు. సమాచారం అందుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హుటాహుటిన సిద్దిపేటకు బయల్దేరగా.. ఆయనను మార్గమధ్యంలోనే అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో బండి సంజయ్ ప్రతిఘటించడంతో.. ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. సంజయ్‌ను అరెస్ట్ చేసి కరీంనగర్‌కు తరలించారు.
బండి సంజయ్‌కు అమిత్‌షా ఫోన్..
బండి సంజయ్‌కు అమిత్‌షా ఫోన్ చేసి సిద్దిపేట ఘటనపై ఆరా తీశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాగా నేడు ఈ ఘటనపై చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌ను కలిసి ఫిర్యాదు చేయాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. కాగా సిద్దిపేట ఘటన గురించి తెలుసుకున్న.. కేంద్ర హోంమంత్రి కిషన్‌రెడ్డి సైతం సోమవారం రాత్రి సిద్దిపేటకు చేరుకున్నారు. రఘునందన్‌రావును కలిసి విషయం అడిగి తెలుసుకున్నారు. అయితే ఎవరింట్లో డబ్బు దొరికినా తనవేననడం కరెక్ట్ కాదని రఘునందన్‌రావు పేర్కొన్నారు.