ప్రధాని మెచ్చిన ప్రతాప్.. ఎంతటి విజయాన్ని సాధించాడో తెలిస్తే
- IndiaGlitz, [Monday,July 06 2020]
కర్ణాటకలోని మైసూరుకు సమీపంలోని కాడైకుడికి చెందిన ప్రతాప్(21) పేరు ఇప్పుడు దేశం మొత్తం మార్మోగుతోంది. ఇతను సాధించిన విజయం.. సాధారణమైనది కాదు.. 126 దేశాలను వెనక్కు నెట్టి అగ్ర స్థానంలో నిలిచాడు. ఇండియా సహా 127 దేశాలు పాల్గొన్న ఆ పోటీలో ప్రతాప్ తయారు చేసిన డ్రోన్‌కి మొదటి బహుమతి దక్కింది. ప్రతాప్ విజయగాథ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమే. కటిక పేదరికంలో పెరగిన ప్రతాప్‌కు కనీసం రూ.100 దొరకడం కూడా కష్టమే. దీంతో చిన్న చిన్న పనులకు వెళుతూ ఆ వచ్చిన డబ్బుతో ఇంటర్నెట్ సెంటర్‌కు వెళ్లి ఇస్రో, నాసా, బోయింగ్, రోల్స్ రాయిస్ వంటి వాటి గురించి సెర్చ్ చేసేవాడు. అక్కడి నుంచే సైంటిస్టులకు మెయిల్స్ పంపేవాడు. ఎలక్ట్రానిక్స్ అంటే ప్రతాప్‌కి చాలా ఇష్టం. ఇంజనీరింగ్ ఇన్ ఎలక్ట్రానిక్స్ చేయాలన్నది అతని కల అయినప్పటికీ చదివే స్తోమత లేక బీఎస్సీలో జాయిన్ అయ్యాడు.
ప్రతాప్ పబ్లిక్ టాయిలెట్స్‌లో పని చేస్తూ.. ఒక మిత్రుని సాయంతో కొన్ని కోర్సులను నేర్చుకున్నాడు. కంప్యూటర్ విడి భాగాలను సేకరించి వాటిపై పరిశోధన చేసేవాడు. పగలు చదువు.. రాత్రి ప్రయోగాలు చేస్తుండేవాడు. తొలి 80 ప్రయోగాలు విఫలమే.. ఎట్టకేలకు సక్సెస్‌ఫుల్‌గా ఓ డ్రోన్‌ను తయారు చేసి గాలిలో ఎగిరించాడు. ఆ రోజు ప్రతాప్ ఆనందానికి అవధుల్లేవు. డ్రోన్ మోడళ్లకు సంబంధించి రకరకాల ప్లాన్లు తయారు చేసి పెట్టుకున్నాడు. ఢిల్లీలో జరిగిన డ్రోన్స్ కాంపిటిషన్‌లో సెకండ్ ప్రైజ్ గెలుచుకోవడంతో పాటు జపాన్‌లో జరగబోయే డ్రోన్ కాంపిటీషన్‌కి అవకాశం దక్కించుకున్నాడు. తల్లి మంగళసూత్రం, చెవి దిద్దులు అమ్మిన డబ్బుతో పాటు ఓ దాత సహకారంతో టోక్యోకి వెళ్లాడు. తనతో పాటు మరో 126 దేశాల వారు ఆ పోటీలో పాల్గొన్నారు. పోటీలో తన మోడల్‌ను సమర్పించి, డ్రోన్ పనితీరును వారికి చూపించి వివరించాడు. ఆ పోటీలో ప్రతాప్‌కు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. దీంతోపాటు 10,000 డాలర్లు(సమారు 7 లక్షల రూపాయలు) ప్రతాప్‌కి బహుమతిగా అందాయి.
3వ బహుమతి పొందిన ఫ్రాన్స్ వాళ్ళు అక్కడికక్కడే ప్రతాప్‌ని సంప్రదించారు. నెలకు రూ.16 లక్షల జీతం.. ప్యారిస్‌లో ప్లాటు, కారు ఆఫర్ చేశారు. కానీ సున్నితంగా తిరస్కరించి తిరిగి ఇండియా వచ్చేశాడు. ప్రతాప్ ఘన విజయాన్ని తెలుసుకున్న బీజేపీ నేతలు అతడిని అభినందించారు. అనంతరం విషయాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లి.. ప్రతాప్‌ని ఆయన ముందు నిలబెట్టారు. ప్రతాప్‌ని మోదీ అభినందించడమే కాకుండా డీఆర్‌డీవోలో ఉద్యోగానికి సిఫార్స్ చేశారు. ప్రధాని అంతటి వ్యక్తే సిఫార్స్ చేస్తే ఉద్యోగం రాకుండా ఉంటుందా? డీఆర్‌డీవో డ్రోన్ విభాగంలో సైంటిస్టుగా ప్రతాప్‌కు ఉద్యోగం లభించింది. ప్రస్తుతం నెలకు 28 రోజులు విదేశీ టూర్లలోనే ఉంటూ దేశానికి ఎన్నో ఆఫర్లను తీసుకొస్తున్నాడు.