Drohi Review: మర్డర్ చుట్టూ తిరిగే 'ద్రోహి'.. మూవీ రివ్యూ
- IndiaGlitz, [Tuesday,November 14 2023]
తారాగణం : సందీప్ బొడ్డపాటి, దీప్తి వర్మ, షకలక శంకర్, మజిలీ శివ, మహేష్ విట్ట, డెబ్బి.
సంగీతం : అనంత నారాయణ ఏ.జి
నిర్మాణం: ప్లే వరల్డ్ క్రియేషన్స్, సాఫిరస్ ప్రొడక్షన్స్ ప్రొడక్షన్స్, గుడ్ ఫెల్లోస్ మీడియా సంయుక్తంగా.
నిర్మాతలు: రాజశేఖర్ రవి పూడి, శ్రీకాంత్ రెడ్డి దుగ్గెంపూడి.
దర్శకుడు: విజయ్ దాస్ పెందుర్తి
కథలోకి వెళితే :
అజయ్ (హీరో సందీప్) ఒక వ్యాపారవేత్త. తన క్లోజ్ ఫ్రెండ్స్‌తో కలిసి రకరకాల వ్యాపారాలు చేస్తే వుంటాడు. ఎంత కష్టపడుతున్నా.. ఎఫర్ట్ పెడుతున్నా బిజినెస్‌లో నష్టపోవడమే కానీ కలిసి రావడం మాత్రం జరగదు. ప్రొఫెషనల్‌గా ఎంత నష్టపోతున్నప్పటికీ.. అతని భార్య చంద్రిక (దీప్తి వర్మ) భర్తకు అన్ని రకాలుగా సపోర్ట్‌గా వుంటుంది. ఏదో ఒక రోజున సక్సెస్ కొట్టొచ్చు అని చెబుతూ అజయ్‌కి ధైర్యం నూరిపోస్తూ వుంటుంది. కాలం గడుస్తున్నా అతని లైఫ్‌లో ఎలాంటి మార్పూ రాకపోవడంతో ఒత్తిడిలో వుంటాడు.. సరిగ్గా ఇలాంటి సమయంలోనే చంద్రిక అనూహ్యంగా చనిపోతోంది. దీంతో ఈ కేసులో అనుమానితుడిగా అజయ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రిక మరణం వెనుక మిస్టరీ ఏంటీ..? హీరో ఆ కేసు నుంచి ఎలా బయటపడ్డాడు అనేది కథ.
విశ్లేషణ :
డైరెక్టర్ విజయ్ దాస్ ఇలాంటి కథను ఎంచుకున్నప్పుడే గెలిచేశాడు. కథకు తగిన విధంగా స్క్రీన్‌ప్లేను ఎక్కడా స్లో కాకుండా పరుగులు పెట్టించాడు. కమెడియన్‌గా గుర్తింపు సంపాదించిన షకలక శంకర్‌లో ఇలాంటి నటుడు వున్నాడా అనిపించేంతగా తన క్యారెక్టర్‌ను పండించడమే కాకుండా తనలోని కొత్త కోణాన్ని చూపించాడు. ఈ మూవీలో కీలక పాత్ర పోషించిన హీరోయిన్ డెబ్బి.. గతంలో చేసిన పాత్రకు భిన్నమైన రోల్‌లో కనిపించారు. సంగీతానికి కూడా మంచి మార్కులే పడ్డాయి. హీరోగా సందీప్ యాక్టింగ్ బాగుంది. వ్యాపారంలో నష్టాలు వస్తున్న దశలో వాటిని ఎదుర్కోనే తీరులో .. తనకు అండగా నిలిచిన భార్య ఇక లేదని తెలిసి కుమిలిపోతూ లోలోపల సంఘర్షణ అనుభవించే వ్యక్తిగా సందీప్ ఇరగదీశాడు. తొలి సినిమానే అయినప్పటికీ అనుభవమున్న నటుడిలా అలవోకగా చేసుకుంటూ వెళ్లిపోయాడు.
హీరోకు ఫ్రెండ్స్‌గా మహేశ్ విట్టా, నీరోజ్ పుచ్చలు తమ పరిధి మేరకు రాణించారు. మేకర్స్ కూడా చిన్న సినిమా అనే ఆలోచన లేకుండా ఎక్కడా తగ్గకుండా తీశారు. సినిమాను స్క్రీన్‌పై చూస్తున్నంత సేపు ఆ రిచ్‌నెస్ కనిపిస్తూ వుంటుంది. చాందినీ, మజిలీ శివ, దీప్తి వర్మ ఎవరి పాత్రలకు వారు న్యాయం చేశారు. అయితే ఈ తరహా క్రైమ్ , సస్పెన్స్, ఇన్వెస్టిగేటివ్ తరహా మూవీలు గతంలో చాలా రావడంతో రోటీన్‌గా అనిపిస్తుంది. కాకపోతే.. ఈ సెక్టార్‌ను ఇష్టపడే ఆడియన్స్‌ను మాత్రం ‘‘ద్రోహి’’ ఆకట్టుకుంటుంది.