భారత్‌లో తొలిసారి అందుబాటులోకి డ్రైవర్ రహిత రైలు..
Send us your feedback to audioarticles@vaarta.com
భారత్‌లో తొలిసారి డ్రైవర్ రహిత రైలు అందుబాటులోకి వచ్చింది. ఢిల్లీ మెట్రోలో డ్రైవర్ రహిత రైలును ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. మెజెంటా లైన్లో డ్రైవర్ రహిత మెట్రో రైలు పరుగులు తీసింది. దేశంలోనే ఇది మొట్ట మొదటి డ్రైవర్ రహిత రైలు కావడం విశేషం. పశ్చిమ జనక్‌పురి - బొటానికల్ గార్డెన్ మధ్య సుమారు 37 కిలోమీటర్ల పొడవున్న మెజంటా లైన్లో డ్రైవర్ రహిత రైలు సేవలు అందించనుంది. నేటి నుంచే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ... ‘స్మార్ట్ వ్యవస్థ’ దిశగా భారత్ ఎంత వేగంగా దూసుకెళ్తుందో చెప్పడానికి ఇదో నిదర్శనమని పేర్కొన్నారు. ఢిల్లీ మెట్రో ఇప్పుడు నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ ద్వారా అనుసంధానించబడిందని తెలిపారు. మాజీ ప్రధాని వాజ్పాయ్ కృషి వల్లే దేశంలో మొట్టమొదటి మెట్రో రైలు సాధ్యమైందని గుర్తు చేసుకున్నారు. 2014 లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డ సమయంలో కేవలం ఐదు పట్టణాల్లో మాత్రమే మెట్రో సర్వీసులు అందుబాటులో ఉండేవని, కానీ... నేడు 18 పట్టణాల్లో మెట్రో సర్వీసులు అందుబాటులోకి వచ్చాయని ఆయన పేర్కొన్నారు.
డ్రైవర్ రహిత మెట్రో రైలు ప్రారంభమైన సందర్భంగా ఢిల్లీ మెట్రో రైలు కార్పోరేషన్ స్పందించింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నడిచే మెరుగైన రవాణా వ్యవస్థకు సంబంధించి నవ శకానికి ఇది ప్రారంభమని తెలిపింది. డ్రైవర్ రహిత మెట్రో రైలు సేవలను 2021 మధ్య కాలం నాటికి మజ్లిస్ పార్క్-శివ విహార్ మధ్య 57 కిలో మీటర్లు పొడవున్న పింక్ లైన్ మార్గంలోనూ విస్తరించనున్నట్టు వెల్లడించింది. ఈ పింక్ లైన్ కూడా ప్రారంభమైతే ఢిల్లీ మెట్రోలో 94 కిలో మీటర్ల మేర డ్రైవర్ రహిత మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వస్తాయని ఢిల్లీ మెట్రో రైలు కార్పోరేషన్ వెల్లడించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout