Bornvita:అలర్ట్: బోర్న్‌విటా తాగుతున్నారా..? అయితే జాగ్రత్త.. కేంద్రం ఆదేశాలు
Send us your feedback to audioarticles@vaarta.com
మీ పిల్లలకు బోర్న్‌విటా తాగిస్తున్నారా..? అయితే ఈ వార్తను మీరు తప్పకుండా చదవాలి. హెల్త్ డ్రింక్‌గా బోర్న్‌విటాను పాలల్లో కలిపి పిల్లలకు తల్లిదండ్రులు ఇస్తుంటారు. ఇది తాగితే పిల్లలు బాగా హైట్ పెరుగుతారని నమ్ముతూ ఉంటారు. ఇందుకు తగ్గట్టే ఆ కంపెనీ యాడ్లు కూడా అలాగే ఉంటాయి. తమ స్టామినాకు రహస్యం బోర్న్‌విటా తాగడమే అంటూ స్పోర్ట్స్ ప్రముఖులతో ఈ కంపెనీ ప్రచారం చేయిస్తూ ఉంటుంది. దీంతో అందరి ఇళ్లల్లో ఈ బోర్న్‌విటాను పిల్లలకు తాగించడం సర్వ సాధారణం అయిపోయింది. అయితే కేంద్ర ప్రభుత్వం తాజాగా షాకింగ్ న్యూస్ చెప్పింది.
అసలు బోర్న్‌వీటా హెల్త్ డ్రింక్ కానే కాదని తేల్చింది. వెంటనే హెల్త్ డ్రింక్స్ కేటగిరీ నుంచి బోర్న్‌వీటాను తీసేయాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ ఇ-కామర్స్ కంపెనీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. బోర్నవిటా సహా ఇతర కూల్‌డ్రింక్స్/ బేవరేజెస్‌ను ‘హెల్త్ డ్రింక్స్’ కేటగిరీ నుంచి తొలగించాలంది. ‘పిల్లల హక్కుల పరిరక్షణ చట్టం, 2005 సెక్షన్ 3 కింద ఏర్పాటైన జాతీయ పిల్లల హక్కుల రక్షణ కమిషన్ జరిపిన విచారణలో.. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టం, 2006లో హెల్త్ డ్రింక్ అని ఏ పానీయాన్నీ నిర్వచించలేదని నిర్ధరణకు వచ్చింది. ఈ మేరకు ఏప్రిల్ 10 వ తేదీన కేంద్ర వాణిజ్య, పరిశ్రమ మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్లో వెల్లడించింది. అంతేకాకుండా హెల్త్ డ్రింక్స్ లేదా ఎనర్జీ డ్రింక్స్ కేటగిరి కింద ఈ-కామర్స్ వెబ్సైట్లలో విక్రయించబడుతున్న డైరీ బేస్డ్ బెవరేజ్ మిక్స్, సెరియల్ బేస్డ్ బెవరేజ్ మిక్స్, మాల్ట్ బేస్డ్ బెవరేజ్‌లను కూడా హెల్త్ డ్రింక్స్ కేటగిరి నుంచి తొలగించాలి' అని పేర్కొంది.
బోర్నవిటాలో అధిక చక్కెర ఉందంటూ ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ ఒకరు వీడియోను పోస్ట్ చేయడంతో ఈ వ్యవహారం బయటకి వచ్చింది. ఇందులోని కొన్ని పదార్థాలు పిల్లలకు హాని కలిగించేలా ఉన్నాయంటూ అతడు పేర్కొన్నాడు. అయితే వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తికి బోర్నవిటా బ్రాండ్ నడుపుతున్న మాండెలెజ్ ఇండియా అప్పట్లో లీగల్ నోటీసు జారీ చేసింది. దీంతో ఆ వీడియోను ఇన్ఫ్లూయెన్సర్ అన్ని ప్లాట్‌ఫారాల నుంచి డిలీట్ చేశారు. దీనిపై కేంద్ర వాణిజ్య శాఖకు ఫిర్యాదు అందడంతో విచారణ జరిపింది.
ఈ విచారణలో భాగంగా బోర్నవిటాలో అనుమతించిన దానికంటే అధికంగా చక్కెర స్థాయిలు ఉన్నట్లు గుర్తించింది. దీంతో తప్పుదోవ పట్టించే ప్రకటనలు మానుకోవాలని మాండలెజ్ ఇండియాకు నోటీసులు కూడా పంపింది. తాజాగా హెల్త్ డ్రింక్ జాబితా నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఇప్పటికే డెయిరీ సంబంధిత, మాల్ట్ ఆధారిత డ్రింకులను హెల్త్ డ్రింకులుగా లేబుల్ చేయొద్దంటూ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ఆదేశించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments