డా.రాజశేఖర్ నటవిశ్వరూపంతో 'అర్జున'
- IndiaGlitz, [Friday,February 14 2020]
డాక్టర్ రాజశేఖర్ ద్విపాత్రాభినయం చేసిన చిత్రం అర్జున. అందాల భామ మరియం జకారియా కథానాయికగా నటించింది. కన్మణి దర్శకత్వం వహించారు. నట్టిస్ ఎంటర్ టైన్మెంట్స్, క్విటీ ఎంటర్ టైన్మెంట్స్ పతాకాలపై నట్టి కరుణ, నట్టి క్రాంతి అందిస్తున్న ఈ చిత్రం విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, త్వరలోనే ట్రైలర్ ను విడుదల చేసి, విడుదల తేదీని ప్రకటిస్తాం అని చెప్పారు. ఇందులో తండ్రీ కొడుకులుగా రాజశేఖర్ తన పాత్రలలో నట విశ్వరూపం చూపించారని అన్నారు.
ప్రస్తుత రాజకీయ నేపధ్య పరిస్థితులకు అద్దంపట్టే చిత్రమిదని అన్నారు. కాస్త వయసు మళ్ళిన సూర్యనారాయణ అనే రైతు పాత్రలోనూ... అలాగే ఆయన తనయుడిగా అర్జున పాత్రలోనూ రాజశేఖర్ ఒదిగిపోయిన విధానం ప్రేక్షకులను ఎంతగానో అలరింపచేస్తుందని చెప్పారు. తండ్రీకొడుకుల మధ్యన వచ్చే భావోద్వేగ సన్నివేశాలు సినిమాకు మరో హైలైట్ గా, హృదయానికి హత్తుకునేలా వుంటాయని చెబుతూ...ఏ పాత్రకు తగ్గ ఆర్టిస్ట్ ఆ పాత్రకు కుదిరారని అన్నారు. యదార్థ సంఘటనలను ప్రేరణగా తీసుకుని సహజత్వానికి దగ్గరగా దర్శకుడు కన్మణి ఈ చిత్రాన్ని మలిచారని చెప్పారు.
ఈ చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రలలో కోట శ్రీనివాసరావు, చలపతిరావు, రేఖ, మురళీశర్మ, సుప్రీత్, కాదంబరి కిరణ్, శివాజీరాజా తదితరులు తారాగణం. ఈ చిత్రానికి కెమెరా: ఎ.విజయకుమార్, సంగీతం: వందేమాతరం శ్రీనివాస్, ఎడిటింగ్: గౌతంరాజు, నిర్మాతలు: నట్టి కరుణ, నట్టి క్రాంతి, దర్శకత్వం: కన్మణి.