ఫిలిం నగర్ దైవ సన్నిదానం చైర్మన్ గా డా.మోహన్ బాబు
- IndiaGlitz, [Monday,January 22 2018]
ఫిలిం నగర్ దైవ సన్నిదానం చైర్మన్ పదవికి డా. మోహన్ బాబు గారు నేడు ప్రమాణ స్వీకారం చేసారు.
విశాఖ శ్రీ శారదా పీఠం అధిపతి శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహా స్వామి వారు ఆధ్వర్యంలో 12 మంది పాలక మండలి కొత్త సభ్యులుగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. చైర్మన్ డా.మోహన్ బాబు గారు నియమితులు కాగా, కమిటి సభ్యులుగా ప్రముఖ నటులు గిరి బాబు, రచయిత పరుచూరి గోపాల కృష్ణ, రెబెల్ స్టార్ కృష్ణం రాజు గారి సతీమణి శ్రీమతి శ్యామల, మెగా స్టార్ చిరంజీవి సతీమణి శ్రీమతి కొణిదెల సురేఖ, చాముండేశ్వరి నాథ్, వి. రామ్ ప్రసాద్ ఉన్నారు.
కార్యదర్శిగా కాజా సూర్య నారాయణ కొనసాగుతున్నారు. ఫిలిం నగర్ దైవ సన్నిదానం ప్రాంగణంలో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎం.పి, 'కళాబంధు' శ్రీ టి.సుబ్బరామి రెడ్డి గారు, రాజమండ్రి ఎంపి. మురళి మోహన్ కూడా పాల్గొన్నారు.
పూర్ణకుంభ స్వాగతనంతరం.. సంప్రదాయ, ఆచారాలతో వేద మంత్రోచ్చారణల నడుమ చైర్మన్ గా డా. మోహన్ బాబు మరియు ఇతర సభ్యులు పదవీ బాధ్యతలు స్వీకరించారు. శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ.. దైవ భక్తి, ఆధ్యాత్మిక చింతన మెండుగా ఉన్న మోహన్ బాబు గారు చైర్మన్ గా పదవి చేపట్టడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. "ఉన్నది ఉన్నట్లు సూటిగా మాట్లాడే మోహన్ బాబు గారంటే నాకు చాలా ఇష్టం, ఆయన ముక్కోపి అని అందరూ అనుకుంటారు. మాట కటువుగా ఉన్న ఆయన మనసు వెన్న," అని అన్నారు శ్రీ స్వరూపానందేంద్ర.
మోహన్ బాబు గారు మాట్లాడుతూ..."నేను ఎన్నడూ గుడి చైర్మన్ అవ్వాలనుకోలేదు. ఎందుకంటే మా సంస్థలు, చిత్రాలతో బిజీగా ఉన్న నాకు మళ్ళి ఈ అదనపు బాధ్యత ఎందుకనుకున్నా, పైగా నిజాన్ని నిర్భయంగా చెప్పడం నాకలవాటు. కానీ ఆ మహా శివుడు టి.సుబ్బరామి రెడ్డి గారి స్వరూపంలో వచ్చి ఫిలిం నగర్ దైవ సన్నిదానం చైర్మన్ బాధ్యతలు స్వీకరించామన్నాడు. శ్రీ స్వరూపానందేంద్ర స్వామి గారిని నేను, రజినీకాంత్ సుబ్బరామి రెడ్డి గారి ద్వారా ఓ సారి కలవడం జరిగింది. నాతోపాటు సభ్యులుగా బాధ్యతలు చేపట్టిన అందరికి అభినందనలు. ఆడపడుచులు పూజ చేస్తే మంచిదంటారు. సురేఖ, శ్యామల గారితో పాటు సభ్యులుగా ఎంపికైన ఆడపడుచులకు నా అభినందనలు.
సన్నిదానంలో ఉన్న పద్దెనిమిది దేవాలయంలో కొలువైయున్న దేవుళ్ళ ఆశీస్సులతో మంచి కార్యక్రమాలు చేపడతామని ఆశిస్తున్నాను. మురళి మోహన్ బావగారికి మాకు తన విలువైన సలహాలందించాలని కోరుతున్నాను. దేవాలయాన్ని పరిశుభ్రంగా ఉంచడం మనందరి ప్రథమ కర్తవ్యం. కమ్మ, కాపు, రెడ్డి కులాల వలే బ్రాహ్మణులలో కూడా శాఖలుంటాయి. అందరూ కలిసి ఆ భగవంతుడి సేవ చేద్దామని కోరుతున్నాను. నా అల్లుడు కూడా బ్రాహ్మణుడే అని ఈ సందర్భంగా చెప్తున్నాను.
బ్రాహ్మణోత్తములకు నా హృదయ పూర్వక నమస్కారాలు. ఎవరి పని వారు చేసుకుంటే అన్ని సక్రమంగా నడుస్తాయి, మేము కూడా విద్యాలయాలు అలానే నడుపుతున్నాము. దేవుడి డబ్బు పైసా ముట్టుకోకుండా అవసరమయితే నా సొంత డబ్బులు ఖర్చుపెట్టయినా సరే సన్నిదానంలో అభివృద్ధి పనులు చేపట్టాలని సంకల్పిస్తున్నాను."