వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌పై ఎన్నో అనుమానాలు.. అసలేం జరిగింది!
- IndiaGlitz, [Friday,July 10 2020]
కాన్పూర్ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌పై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వర్షానికి పోలీస్ వ్యాన్ అదుపుతప్పి పడిపోగానే పోలీసుల నుంచి తుపాకి లాక్కొని దూబే తప్పించుకుని పారిపోతుండగా తాము కాల్పులు జరిపాల్సి వచ్చిందని కాన్పూర్ ఐజీ మోహిత్ అగర్వాల్ తెలిపారు. ఆ కాల్పుల్లో దూబే మరణించినట్టు వెల్లడించారు. కాగా.. యూపీ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు 13 కార్ల కాన్వాయ్‌తో భారీ భద్రత నడుమ వికాస్ దూబేను ఉజ్జయిని నుంచి కాన్పూర్‌కి తరలిస్తున్నారు.
అయితే కాన్పూర్ నగర సమీపంలో బర్రా వద్దకు రాగానే 13 కార్ల కాన్వాయ్‌లో ఒక్క దూబే ఉన్న కారు మాత్రమే అదుపుతప్పి పడిపోవడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. భారీ భద్రత ఉండగా.. దూబే తుపాకి లాక్కొని పారిపోయే సాహసం చేస్తాడా? అని అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్షాల సైతం వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. కారు తిరగబడలేదని... ప్రభుత్వం పడిపోకుండా కాపాడుకున్నారని విపక్ష నేత అఖిలేశ్ యాదవ్ ఆరోపణలు గుప్పించారు.
దూబే ఎన్కౌంటర్ ఊహించిందేనని.. దానిని చూస్తే సైబరాబాద్ ఎన్కౌంటర్ గుర్తొస్తోందని.. ఏమాత్రం చట్టబద్దంగా లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఎన్కౌంటర్ జరిగినప్పుడల్లా ఆరోపణలు రావడం సహజం. తెలంగాణలో కూడా అటు వరంగల్ ఎన్కౌంటర్ జరిగినప్పుడు కానీ.. ఇటు దిశ నిందితుల ఎన్కౌంటర్ జరిగినప్పుడు పోలీసులపై ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.