హైదరాబాద్‌లో మళ్లీ సందడి చేయనున్న డబుల్ డెక్కర్ బస్సులు!

  • IndiaGlitz, [Saturday,November 07 2020]

జంట నగరాల్లో ఒకప్పుడు సందడి చేసిన డబుల్ డెక్కర్ బస్సులు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా తెలంగాణ మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో రవాణా శాఖ మంత్రితో కేటీఆర్ జరిపిన సంభాషణ చాలా ఆసక్తికరంగా మారింది. ఒకప్పుడు హైదరాబాద్‌లో డబుల్‌ డెక్కర్‌ బస్సులు సందడి చేసేవని.. హైదరాబాద్‌ అందాలను వీక్షించేందుకు... పర్యాటకులు డబుల్‌ డెక్కర్‌ బస్సుల పట్ల ఆసక్తి చూపేవారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో డబుల్‌ డెక్కర్‌ బస్సులు ఎందుకు ఆపారో తెలియదన్నారు. డబుల్‌ డెక్కర్‌ బస్సులు తిరిగి తెచ్చేందుకు అవకాశాలను పరిశీలించాలని... ట్విట్టర్ వేదికగా
మంత్రి పువ్వాడను కేటీఆర్ ట్విట్టర్ ద్వారా కోరారు. కేటీఆర్ ట్వీట్‌పై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు. ఆర్టీసీ ఎండీతో మాట్లాడి బస్సులను తిప్పే అవకాశాలను పరిశీలిస్తామని పువ్వాడ వెల్లడించారు.

కాగా.. డబుల్ డెక్కర్ బస్సులతో తనకు ఎన్నో మధురమైన జ్ణాపకాలు ఉన్నాయని.. ఆబిడ్స్‌లోని సెంట్ జార్జ్ గ్రామర్ స్కూల్‌కు వెళ్లేటప్పుడు ఈ బస్సులో వెళ్ళేవాడినని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులు కనిపించక దశాబ్దంపైనే అవుతోంది. కేటీఆర్, పువ్వాడల సంభాషణను బట్టి చూస్తే త్వరలోనే డబుల్ డెక్కర్ బస్సులు పక్కాగా రోడ్డెక్కనున్నట్టు స్పష్టమవుతోంది.