Double Decker:ఏళ్ల తర్వాత హైదరాబాద్ రోడ్లపైకి డబుల్ డెక్కర్ బస్సులు, ఏయే రూట్లలో అంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
భాగ్యనగర వాసుల చిరకాల వాంఛ అయిన డబుల్ డెక్కర్ బస్సులు దశాబ్ధాల తర్వాత తిరిగి హైదరాబాద్ రోడ్లపై చక్కర్లు కొట్టాయి. నగరంలోని పలు పర్యాటక ప్రాంతాలను చుట్టివచ్చేలా ప్రత్యేక రూట్ మ్యాప్‌ను హెచ్ఎండీఏ రూపొందించింది. రూ.12.96 కోట్లతో ఆరు డబుల్ డెక్కర్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను హెచ్ఎండీఏ కొనుగోలు చేసింది. హైదరాబాద్‌కే తలమానికమైన ట్యాంబ్ బండ్, బిర్లామందిర్, అసెంబ్లీ, సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, మక్కామసీదుతో పాటు గోల్కండ కోట, గండిపేట పార్క్, దుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జి, తారామతి బారాదరి, ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాల్లో ఈ డబుల్ డెక్కర్లను నడపనున్నారు.
ప్రస్తుతానికి ఉచితంగానే సర్వీసులు :
ఉదయం ట్యాంక్ బండ్ వద్ద బయలుదేరి.. ఆయా రూట్లలో ప్రయాణీకులను గమ్యస్థానానికి చేర్చిన తర్వాత తిరిగి ట్యాంక్‌బండ్‌కు చేరుకుంటాయి. ఇవి ఎలక్ట్రిక్ బస్సులు కావడంతో ఖైరతాబాద్ ఎస్టీపీ, సంజీవయ్య పార్కులలో ప్రత్యేక ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. అయితే ఈ బస్సుల్లో ప్రస్తుతానికి ప్రయాణం ఉచితమే. ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. జాయ్ రైడ్ పేరుతో ఉచితంగా తిరిగే ఈ సర్వీసులు మధ్యాహ్నం 3.30 నుంచి రాత్రి 9.30 గంటల మధ్య ప్రయాణీకులు వినియోగించుకోవచ్చు. త్వరలోనే కనీస ఛార్జి విధించే అవకాశం వుంది. పర్యాటకుల నుంచి వచ్చే స్పందనను బట్టి మరికొన్ని రూట్లను అధికారులు ఎంపిక చేయనున్నారు.
నెటిజన్ల కోరిక తీర్చిన కేటీఆర్ :
కాగా.. ఒకప్పుడు హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులు ఫుల్ ఫేమస్. నగరాన్ని చూడటానికి వచ్చే సందర్శకులతో పాటు స్థానికులు ఆ బస్సుల్లో ప్రయాణించి కొత్త అనుభూతిని పొందేవారు. అయితే కాలక్రమంలో ఆ బస్సులు హైదరాబాద్ రోడ్ల మీద నుంచి కనుమరుగైపోయాయి. అయితే డబుల్ డెక్కర్ బస్సులను తిరిగి అందుబాటులోకి తీసుకురావాలని కొందరు నెటిజన్లు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఆయన ఆర్టీసీ, జీహెచ్ఎంసీ, పర్యాటక శాఖ అధికారులతో పలుమార్లు సమావేశాలు ఏర్పాటు చేసి డబుల్ డెక్కర్ బస్సులను తీసుకొచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments